హైదరాబాద్ చేరిన కొవిషీల్డ్ టీకా..
Covishield Vaccine reached Hyderabad.ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్,హైదరాబాద్ చేరిన కొవిషీల్డ్ టీకా..
By తోట వంశీ కుమార్ Published on 12 Jan 2021 12:40 PM ISTఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ రాష్ట్రానికి వచ్చింది. తొలి దశ వ్యాక్సిన్ రవాణాలో భాగంగా కొవిడ్ షీల్డ్ టీకా డోసులు పుణె నుంచి హైదరాబాద్ చేరుకున్నాయి. మంగళవారం ఉదయం పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి ట్రక్కుల్లో పుణె ఎయిర్‌పోర్టుకు తరలించారు. 6.5 లక్షల డోసుల కొవిడ్ టీకాలు ఉదయం 11 గంటల సమయంలో ప్రత్యేక కార్గో విమానంలో రాష్ర్టానికి చేరుకున్నాయి. వీటిని కోఠిలోని శీతలీకరణ కేంద్రానికి తరలించనున్నారు. ఇందుకోసం కోఠి ఆరోగ్య కార్యాలయంలో 40 క్యూబిక్ మీటర్ల వ్యాక్సిన్ కూలర్ ఏర్పాటు చేశారు.
ఈ నెల 16 నుంచి రాష్ర్ట వ్యాప్తంగా కొవిడ్ టీకా పంపిణీ ప్రారంభం కానుంది. ఇందుకోసం రాష్ర్ట వ్యాప్తంగా 1,213 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి రోజు 139 కేంద్రాల్లో 13,900 మందికి కొవిడ్ టీకా వేయనున్నారు. వ్యాక్సిన్‌ను తరలించేందుకు 866 కోల్డ్ చైన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. తొలుత 2.90 లక్షల మంది ప్రభుత్వ, ప్రయివేటు వైద్య సిబ్బందికి టీకా వేయనున్నారు. వారంలో నాలుగు రోజులు వైద్య సిబ్బంది టీకాలు వేయనుంది. బుధ, శనివారాల్లో యథావిధిగా సార్వత్రిక టీకాల కార్యక్రమం కొనసాగనుంది. ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకా పంపిణీ చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 16 నుంచి కొవిడ్ టీకా పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. వ్యాక్సిన్ వేసిన తరువాత ఎవరికైనా దుష్ఫలితాలు(రియాక్షన్) ఎదురైతే వెంటనే అవసరమైన చికిత్సకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సీరం సంస్థ రూపొందించిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్‌లను సమర్థవంతమైన వ్యాక్సిన్లుగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ టీకాలనే తెలంగాణలోనూ అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ముందుగా ఆశా ఆరోగ్య కార్యకర్తలు, అంగన్ వాడీ సిబ్బంది సహా, వైద్య సిబ్బందికి.. ఆతరువాత కొవిడ్ వ్యాప్తి నివారణలో ముందుండి పోరాడుతున్న పోలీసులు, భద్రతా బలగాలు, పారిశుద్య్ద సిబ్బంది తదితరులకు టీకాలను అందించాలని అధికారులను ఆదేశించారు. ఆతరువాత 50ఏళ్లు పైబడిన వారికి, అనంతరం 18-50 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాకిన్ అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.