తెలంగాణలో కొవిడ్ మూడో దశ ముగిసినట్లే.. ఐటీ సంస్థలు ఇక వర్క్ ఫ్రం హోమ్ వద్దు
Covid Third wave end in Telangana says health Director srinivasa rao.తెలంగాణ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని
By తోట వంశీ కుమార్ Published on 8 Feb 2022 9:13 AM GMTతెలంగాణ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ముగిసి పోయినట్లేనని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్) డా.శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై మంగళవారం హైదారాబాద్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. జనవరి 23న మూడో దశ ఉద్దృతి పెరిగిందని.. ఆ సమయంలో రాష్ట్రంలో కొవిడ్ పాజిటివిటీ రేటు అత్యధికంగా 5 శాతానికి వెళ్లిందన్నారు. అనంతరం క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రస్తుతం 2 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉందన్నారు.
థర్డ్ వేవ్ మొదలైనప్పటి నుంచి తాము సమర్థంగా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. టీకా తీసుకున్న వారిలో వైరస్ ప్రభావం తక్కువగా ఉందన్నారు. మూడో దశ కేవలం రెండు నెలల్లోనే అదుపులోకి వచ్చిందన్నారు. మూడో దశ ముగిసిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. కొవిడ్ తొలి దశలో దాదాపు 10 నెలలు ఇబ్బంది పడగా.. రెండో దశ ఆరు నెలలు ఉందన్నారు. ఇక మూడో దశలో 28 రోజుల్లోనే ఎక్కువ కేసులు నమోదు అయినట్లు తెలిపారు. కొవిడ్ నియంత్రణలో వ్యాక్సిన్ కీలకంగా పని చేసిందన్నారు.
తెలంగాణలో ఫీవర్ సర్వే ద్వారా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కిట్లు అందజేశారన్నారు. ఇక రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలు లేనందు వల్ల అన్ని సంస్థలు 100 శాతం పని చేయొచ్చునని తెలిపారు. పూర్తి స్థాయిలో ఉద్యోగులు కార్యాలయాలు వెళ్లొచ్చునని చెప్పారు. ఇక ఐటీ కంపెనీలు సైతం వర్క్ ఫ్రం హోం తీసివేయాలని కోరారు. ఇక విద్యాసంస్థలను పూర్తిగా ప్రారంభించామని.. ఆన్‌లైన్ తరగతులతో పిల్లల్లో మానసిక సమస్యలు వస్తాయన్నారు. ఇక మేడారం జాతర సందర్భంగా ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 150 బెడ్స్ కలిగిన ఆస్పత్రిని సిద్దం చేశామని.. అవసరమైన పరీక్షలు అక్కడే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇక రాబోయే కొద్ది నెలల పాటు కొత్త వేరియంట్ వచ్చే అవకాశం లేదన్నారు. త్వరలోనే కొవిడ్ సాధారణ ప్లూగా మారనుందన్నారు.