తీన్మార్ మల్లన్న కు రంగారెడ్డి కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఎస్‌వోటీ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లన్న టీమ్‌పై 363 ,342, 395, 332, 307 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ 7 (1) కింద కేసులు నమోదు చేశారు. గత వారం జడ్జి మల్లన్నకు 14రోజుల రిమాండ్ విధించారు. మల్లన్నతో పాటు మరో నలుగురిని పోలీసులు చర్లపల్లి జైలు కు తరలించారు. బెయిల్ కోసం మల్లన్న కోర్టు మెట్లెక్కగా.. ఆయనకు అక్కడ కూడా చుక్కెదురైంది.
తీన్మార్ మల్లన్న నిజాలు చెప్తున్నాడనే జైలుకు తీసుకెళ్లారని ఆయన తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. అర్థరాత్రి తన కొడుకును అరెస్టు చేశారని ఆరోపించారు. అరెస్టుకు ముందు నోటీసులు కూడా జారీ చేయలేదని, రౌడీల్లా, దొంగల్లా వచ్చి తన కొడుకును తీసుకెళ్లారన్నారు. మీ బిడ్డను తప్పించేందుకు తన కొడుకుతో ఆడుకుంటున్నారని మల్లన్న తల్లి సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేశారు. అది ఎంత వరకు న్యాయం అని నిలదీశారు. తన కొడుకు నిజంగా తప్పు చేస్తే.. తానే అతన్ని తీసుకెళ్లమని చెప్తామన్నారు. ఏ తప్పూ చేయని మల్లన్నను అరెస్టు చేశారని ఆమె ఆవేదన చెందారు.