తెలంగాణ‌లో కరోనా సెకండ్ వేవ్ ముగిసింది

Corona Second Wave In Telangana. తెలంగాణలో కరోనా చాలా వరకు నియంత్రణలోకి వచ్చిందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్ట‌ర్‌ శ్రీనివాసరావు

By Medi Samrat  Published on  18 Aug 2021 11:38 AM GMT
తెలంగాణ‌లో కరోనా సెకండ్ వేవ్ ముగిసింది

తెలంగాణలో కరోనా చాలా వరకు నియంత్రణలోకి వచ్చిందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్ట‌ర్‌ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ముగిసిపోయిందని చెప్పారు. బుధవారం కింగ్‌కోఠిలోని తన కార్యాలయంలో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ..అన్ని జ్వరాలను కరోనా వల్ల వచ్చే జ్వరంగా భావించవద్దని సూచించారు. జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని.. అయితే ఈ వ్యాధులు పెరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రాద్రి, ములుగు జిల్లాల్లో 340 మలేరియా కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా హైదరాబాద్‌, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1200కుపైగా డెంగీ కేసులు వచ్చినట్లు తెలిపారు. 13 జిల్లాల్లో మలేరియా, డెంగీ అధికంగా ఉన్నట్టు గుర్తించామని ఆయ‌న వెల్లడించారు. ఇక‌ తెలంగాణలో ఇప్పటివరకు 1.65 కోట్ల మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో 56 శాతం మందికి తొలి డోస్‌ వ్యాక్సిన్‌ వేసినట్లు వెల్లడించారు. 34 శాతం మందికి రెండు డోసులు పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు.


Next Story