తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్(మాదక ద్రవ్యాలు) వినియోగాన్ని నియంత్రించే దిశగా చేపట్టాల్సిన కఠిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంలో దోషులుగా తేలినవారు ఎంతటివారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
కఠిన చర్యల అమలకై ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. నార్కోటిక్, ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. వెయ్యి మందితో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ను ఏర్పాటు చేయాలని, ఈ ప్రత్యేక విభాగం రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యంలో డ్రగ్స్ ను, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవడం కోసం ప్రత్యేక విధులను నిర్వర్తించనున్నట్లు తెలిపారు.
ఇక ఈ నెల 28న స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్ జరపాలని సీఎం నిర్ణయించారు. ఈ సమావేశంలో డ్రగ్స్ నివారణ విధివిధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో చర్చించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర హోం మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి, సిఎస్, డిజిపి, డిజీలు, అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, డిసిపీ అధికారులు వారితో పాటు రాష్ట్ర ఎక్సైజ్ పోలీస్ శాఖకు చెందిన ఎస్పీలు సంబంధిత ఉన్నతాధికారులు తదితరులు పాల్గొననున్నారు.