'కాంగ్రెస్ సీతక్కని సీఎం చేస్తుంది'.. రేవంత్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 10 July 2023 6:44 AM GMT'కాంగ్రెస్ సీతక్కని సీఎం చేస్తుంది'.. రేవంత్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం వంటివి కాంగ్రెస్ పార్టీ చొరవ అని ఆయన పేర్కొన్నారు. ఈ రెండింటినీ పూర్తి చేసేది కాంగ్రెస్ పార్టీనే అని, అదే కాంగ్రెస్ విధానమని అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని ఎన్నారైలు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. దళితులు, గిరిజనులను ముఖ్యమంత్రి కానివ్వరా? తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తే కనీసం ఉప ముఖ్యమంత్రి పదవి అయినా సీతక్కకు ఇస్తారా అని ప్రశ్నించారు.
దీనిపై రేవంత్ స్పందిస్తూ.. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్ సంప్రదాయం కాదన్నారు. కాంగ్రెస్ అవసరమైతే సీతక్కను ముఖ్యమంత్రిని చేస్తుందన్నారు. ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపన ఉందని, రానున్న ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అవసరమైన సహాయ, సహకారాలు అందించాలని కోరారు. పార్టీని, తనను విడివిడిగా చూడటం సరికాదని, తెలంగాణలో రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి అని కామెంట్ చేశారు.
అమెరికాలో 23వ తానా మహా సభలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఈ సభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీతక్క ప్రవాస భారతీయుల్ని కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రాంతాలు వేరైనా అభిమానం మాత్రం తగ్గలేదన్నారు. కోవిడ్ సమయంలో తాను చేసిన సేవా కార్యక్రమాల్ని ఎన్‌ఆర్‌ఐలు అబ్జర్వ్ చేశారని అమెరికాలో కూడా తనకు అభిమానులు ఉండటం గర్వంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. మనం చేసే మంచి కార్యక్రమాలే ప్రజల మధ్యకు మనల్ని తీసుకెళ్తాయని అన్నారు.