హజీపూర్ ఘటనలో బాధితులకు ఇంతవరకు న్యాయం జరగలేదని.. అమ్మాయిలను రేప్ చేసి చంపిన శ్రీనివాస్ రెడ్డికి ఇంకా పూర్తిస్థాయిలో శిక్ష పడలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు అన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్ట్ శ్రీనివాస్ రెడ్డి ని ఉరి తీయాలని తీర్పు ఇచ్చినా.. ఇంతవరకు అమలు కాలేదని.. ఎందుకు శ్రీనివాస్ రెడ్డిని ఉరితీయడంలో జాప్యం జరుగుతోందని.. ఊరి శిక్ష అమలుకు హైకోర్టు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని వీహెచ్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ అంశంపై సీరియస్ గా స్పందించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. హ్యూమన్ రైట్స్ కమీషన్ కూడా ఇలాంటి కేసులను సమర్ధించకూడదని అన్నారు.
ప్రభుత్వం విద్యార్థుల ర్యాగింగ్ కట్టడికి పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని యూనివర్సిటీలలో మఫ్టీలో పోలీసులు ఉండాలని సూచించారు. ప్రీతి మరణం పై వాస్తవాలు బయటకు రావాలి.. ప్రీతి మృతికి కారణమైన వారికి కఠిన శిక్ష పడాలని అన్నారు. ఎస్టీ బాలిక డాక్టర్ వరకు చదువుకుని కూడా ఇలాంటి ఘటనకు గురికావడం దారుణం అని అన్నారు. కఠినమైన శిక్షలు అమలు జరిగితే.. మహిళలపై దాడులు ఆగుతాయన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉరి శిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు. హాజీపూర్ ఘటనపై వెంటనే శిక్ష అమలు జరిగి ఉంటే.. మహిళలపై అత్యాచారాలు, దాడులు ఆగేవి అని అన్నారు. కాంగ్రెస్ లో గ్రూపులు అగాలి.. అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. మహేశ్వర్ రెడ్డి యాత్రపై మాణిక్ రావు థాక్రేతో మాట్లాడిన తరువాత చెబుతానని వీహెచ్ తెలిపారు.