పువ్వాడ లాంటి వారిని దగ్గరకు తీసుకోవడం వల్లే కేసీఆర్ ఓడిపోతున్నారు : రేణుకా చౌదరి

రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న కాంగ్రెస్ సునామీ కేసీఆర్ పార్టీని కడిగేస్తుందని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు.

By Medi Samrat  Published on  14 Nov 2023 2:54 PM IST
పువ్వాడ లాంటి వారిని దగ్గరకు తీసుకోవడం వల్లే కేసీఆర్ ఓడిపోతున్నారు : రేణుకా చౌదరి

రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న కాంగ్రెస్ సునామీ కేసీఆర్ పార్టీని కడిగేస్తుందని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు. ఆమె మంగ‌ళ‌వారం మాట్లాడుతూ.. పువ్వాడ అజయ్ ఓటమి భయంతో మా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని.. మా ఖమ్మం కార్పొరేటర్ రాఫీనా బేగం పైనా బైండోవర్ కేసులు వేశారని ఆరోపించారు. ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసి ఇబ్బందులు పెడుతున్నారని.. చట్టానికి విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఖబడ్ధార్ అని పువ్వాడ‌ను హెచ్చ‌రించారు. మీ ఇంటికి వచ్చి సవాలు చేస్తా.. నువ్వు ఓడిపోయిన తక్షణం అక్కడి నుండి పారిపోతావ్ అని అన్నారు.

కాంగ్రెస్ లో గెలిచి పార్టీ మారిన పువ్వాడ అజయ్ లాంటి వారిని దగ్గరకు తీసుకోవడం వల్లే కేసీఆర్ ఓడిపోతున్నాడని జోష్యం చెప్పారు. పువ్వాడ అజయ్ పాలు పోస్తే కాటు వేసే పాము రకం అని విమ‌ర్శించారు. పువ్వాడ అజయ్ కాంగ్రెస్‌ కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెడితే అంత బలంగా ముందుకు వస్తారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటేన‌ని.. మతతత్వ రాజకీయాలు చేస్తున్నార‌ని ఆరోపించారు.

ఖమ్మం జిల్లాలో తాను ప్రచారం చేస్తాన‌ని తెలిపారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దాడులు చేస్తున్నాయ‌ని.. మీరు దాడులు చేస్తారని.. మేము పైసలు ఇంట్లో పెట్టుకొని కూర్చుంటామా అని ప్ర‌శ్నించారు. బీఆర్ఎస్ లో ఎంతమంది కోవర్ట్ లు ఉన్నారో మాకు తెలుసు అన్నారు. మాకు కోవర్ట్ లు ఉన్నారు. వారికి కూడా కోవర్ట్ లు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలో 10 కి 10 స్థానాలు గెలుస్తామ‌న్నారు.

Next Story