కరోనా సెకండ్ వేవ్ ఉద్దృతి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సామాన్యులు, సెలబ్రెటీలు అనే తేడా లేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు ఈ మహమ్మారి బారిన పడగా కొందరు కొలుకోగా.. మరికొందరు మృత్యువాత పడ్డారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం.సత్యనారాయణ రావు కన్నుమూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి కరోనా బారిన పడ్డారు. ఆదివారం ఆయన్ను కుటుంబ సభ్యులు చికిత్స కోసం నిమ్స్‌కు తరలించారు.
నిమ్స్‌లో చికిత్స పొందుతూ.. ఈరోజు తెల్లవారు జామున 3.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎంఎస్ఆర్ మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలియజేసింది. ఎమ్మెస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ చైర్మన్‌గా, దేవాదాయ, క్రీడ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా పనిచేశారు. ఎమ్మెస్సార్.. 1980-83 వరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1990-94 వరకు ఆర్టీసీ చైర్మన్‌గా ఉన్నారు. 2000-04 వరకు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004లో కరీంనగర్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2004-07 వరకు సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.