పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కోర్టు తీర్పు ఎలా వచ్చినా శిరసావహిస్తానని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో ఉందన్నారు. రేపు తీర్పు రాబోతుందన్నారు.
ఉప ఎన్నిక వచ్చినా ఎదుర్కొంటానని, పారిపోయే పరిస్థితి అసలే లేదని తేల్చి చెప్పారు. ఇక ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదని కడియం శ్రీహరి హితవు పలికారు. గత పదేళ్లలో 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుని మంత్రులను చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ స్వార్థపరమైన రాజకీయాలు చేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ చేస్తే సంసారం.. తాము చేస్తే వ్యవభిచరమా? అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన కడియం శ్రీహరి.. బీజేపీ గెలిస్తే మాజీ మంత్రి కేటీఆర్ సంతోషపడుతున్నారని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి బీఆర్ఎస్ పార్టీనే ప్రధాన కారణమని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో ఆప్ ఓడిపోయిందని ఆరోపించారు. బీఆర్ఎస్‌తో ఫ్రెండ్‌షిప్ చేయడంతోనే ఆప్ అధికారం కోల్పోయిందని అన్నారు. ఆప్- కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుండేదని, ఆప్ పార్టీ అతిగా ఆలోచించుకొని ఒంటరిగా పోటీ చేసిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.