రిజర్వేషన్లు కొనసాగాలంటే.. కాంగ్రెస్‌ను గెలిపించాలి: సీఎం రేవంత్
గోండులు, లంబాడాల హక్కులను భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి కాపాడలేదని సీఎం రేవంత్ అన్నారు.
By అంజి Published on 2 May 2024 5:41 PM ISTరిజర్వేషన్లు కొనసాగాలంటే.. కాంగ్రెస్‌ను గెలిపించాలి: సీఎం రేవంత్
గోండులు, లంబాడాల హక్కులను భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి కాపాడలేదని సీఎం రేవంత్ అన్నారు. ఆసిఫాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇప్పటి వరకు ఆదిలాబాద్ ఎంపీ టికెట్‌ను ఏ పార్టీ మహిళలకు ఇవ్వలేదని, కాంగ్రెస్ ఇప్పుడు తొలిసారిగా ఓ మహిళకు టికెట్‌కు ఇచ్చిందని తెలిపారు. 18వ పార్లమెంట్ ఎన్నికల్లో మంత్రి సీతక్క విజ్ఞప్తితో ఆత్రం సుగుణను అభ్యర్థిగా సోనియా గాంధీ నియమించారని తెలిపారు. ప్రజా సమస్యలపై కొట్లాడే సుగుణను గెలిపించాలని కోరారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్, మోదీ ఏనాడూ గిరిజనుల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు.
పోడు భూముల సమస్యలపై కేసీఆర్ దృష్టి పెట్టలేదని సీఎం రేవంత్ అన్నారు. ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి బీజేపీ కృషి చేయలేదని విమర్శించారు. కేంద్ర మంత్రి వర్గంలో గోండులకు స్థానం ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా తనను బెదిరించలేరని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. ఆదిలాబాద్ ప్రజలు అండగా ఉన్నంత కాలం ఢిల్లీ సుల్తాన్‌లను అయినా ధైర్యంగా ఎదుర్కొంటానని అన్నారు. కేసీఆర్ పదేళ్లు 200 కేసులు పెట్టిన భయపడని తనపైకి ఢిల్లీ పోలీసులను ఉసిగొల్పితే కుమ్రంభీం, రాంజీ గోండు మాదిరిగా తిరగబడతానని సీఎం రేవంత్ హెచ్చరించారు.
తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని ఆసిఫాబాద్ జన జాతర సభలో వ్యాఖ్యానించారు. కుట్రలో భాగంగానే ప్రధాని మోదీ 2021లో జరగాల్సిన జనాభా లెక్కింపు చేపట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ''1981 నుంచి ప్రతీ 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలు జరిగాయి. కుల గణన చేస్తే బలహీనవర్గాలకు ఉన్న 27 శాతం రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాల్సి వస్తుంది. అందుకే జనాభా లెక్కలు జరపకుండా రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారు'' అని సీఎం రేవంత్ ఆరోపించారు.