బీఆర్ఎస్ నాయకులు మూసీ పక్కన ముక్కు మూసుకోకుండా ఉండగలరా.? : కాంగ్రెస్ ఎంపీ
బీఆర్ఎస్ నాయకులు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు
By Medi Samrat Published on 18 Oct 2024 8:15 PM ISTబీఆర్ఎస్ నాయకులు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. ప్రజలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో బుద్ధి చెప్పిన కూడా వారికి గుణపాఠం కాలేదన్నారు. మూసీ నది పునర్జీవన కార్యక్రమం ఎంతో పవిత్రమైన కార్యక్రమం.. ఒక యజ్ఞం లాంటిది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మూసి నది పునర్జీవన కార్యక్రమం సజావుగా సాగడానికి సహకరించాలని సీఎం ప్రతిపక్ష నాయకులను కోరారు. అయినా బీఆర్ఎస్ నాయకులు సహకరించకపోగా.. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం అవివేకం అన్నారు.
బీఆర్ఎస్ తన పదేళ్ల కాలంలో మూసీ నది అభివృద్ధికి కృషి చేస్తే ఈ రోజు ఇలా మూసి పరిస్థితి ఎందుకు ఉండేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు మూసీ పక్కన ముక్కు మూసుకోకుండా ఉండగలరా అని ప్రశ్నించారు. మీరు మూసీని బాగు చెయ్యలేదు కాబట్టే మేము చేయాల్సి వస్తుందన్నారు. 2 లక్షల రుణమాఫీ, 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగాల నియామకాలు, ఫ్రీ బస్ ఇవన్నీ మేమే చేసాము కదా.. మీరు ఇవ్వన్నీ చేసుంటే ఉంటే మా ప్రభుత్వము ఇంకో ప్రాధాన్యత కార్యక్రమాలు చేసేది కదా.. అని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు చేయకపోగా మేము చేస్తుంటే.. సహకరించకుండా అడ్డుకోవడం అవివేకమే అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. తగిన సమయంలో తగిన విధంగా జవాబు చెప్తారని హెచ్చరించారు.