సీఎం స్వయంగా లేఖలు రాసి పంపినా రాలేమ‌ని చెప్పడం సరి కాదు : ఎంపీ మల్లు రవి

హైదరాబాద్ స్టేట్‌ను దేశంలో విలీనం చేసిన రోజు.. సెప్టెంబర్ 17, 1948.. రాజుల పాలన పోయి ప్రజా పరిపాలన మొదలైంది

By Medi Samrat  Published on  16 Sept 2024 4:04 PM IST
సీఎం స్వయంగా లేఖలు రాసి పంపినా రాలేమ‌ని చెప్పడం సరి కాదు : ఎంపీ మల్లు రవి

హైదరాబాద్ స్టేట్‌ను దేశంలో విలీనం చేసిన రోజు.. సెప్టెంబర్ 17, 1948.. రాజుల పాలన పోయి ప్రజా పరిపాలన మొదలైంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 17న‌ ప్రజా పాలన దినోత్సవం జరపాలని చూస్తున్నారని ఎంపీ మల్లు రవి అన్నారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రేపు సెప్టెంబర్ 17న‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.

ప్రజా పాలన దినోత్సవంలో హాజరుకావాలని సీఎం రేవంత్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారని తెలిపారు. అదే విధంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను కూడా హాజరుకావాలని కోరారు. కేంద్ర మంత్రి గజేంద్ర షేఖావత్ ను కూడా హాజరుకావాలని లేఖ రాశారు. అయితే.. సిగ్గు లేకుండా కిషన్ రెడ్డి రాలేమంటున్నారని మండిప‌డ్డారు.

అసలు స్వాతంత్ర పోరాటంలో బీజేపీ పార్టీ పాల్గొనలేదు.. ఎందుకంటే ఆ పార్టీ అప్పుడు పుట్టలేదన్నారు. ప్రజా పాలన దినోత్సవంలో పాల్గొనడానికి ఎందుకు రారు అని ప్ర‌శ్నించారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ కూడా సెప్టెంబర్ 17ను గుర్తించలేదన్నారు. రేవంత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయగానే ప్రగతి భవన్ కంచెను తొలగించారు.. ప్రజాపాలనకై చేశామ‌ని చెప్పారు. సీఎం స్వయంగా లేఖలు రాసి పంపినా రాలేను అని చెప్పడం సరైంది కాదన్నారు.

Next Story