కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి..
కేటీఆర్ నాటకాలు వేయడమే కాదు.. వేయిస్తున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ అన్నారు.
By - Medi Samrat |
కాంగ్రెస్ ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్
కేటీఆర్ నాటకాలు వేయడమే కాదు.. వేయిస్తున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ అన్నారు. గణతంత్ర దినోత్సవం నాడు రాజ్యంగాన్ని, రాజ్యాంగ బద్ద హోదాలో ఉన్న స్పీకర్‌ను, సీఎంను అవమానపరిచాడని.. ఇందుకు కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభాపతిని ద్రుతరాష్ట్రునితో పోల్చడం.. సభ్యుడిగా మీకు సంస్కారంగా ఉందా.? సీఎంను అవమానించేట్టుగా మాట్లాడడం ఏ రాజనీతి.? అని ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యతిరేకులుగా మారి.. రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్టుగా నాటకాలు వేస్తూ.. నాటకాలు ఆడిస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వంపై హరీశ్‌రావు అతి తెలివితో మాట్లాడుతున్నారని, ప్రజలను మభ్యపెట్టాలనే ఉద్దేశంతో వాస్తవాలను వక్రీకరిస్తున్నారని అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడితే, బీఆర్ఎస్ నాయకులకు కోల్ టెండర్లు ఎలా వస్తున్నాయని, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? అని నిలదీశారు. ‘‘కేసీఆర్ బంధువులకే టెండర్లు వచ్చాయి. మీకు మాత్రం ముడుపులు ముట్టలేదనే కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా.. నిజాలు కావు. సీఎం, డిప్యూటీ సీఎం మీ మాటలను పట్టించుకునే పరిస్థితి లేదు” అని అన్నారు.