తెలంగాణ సీఎం కేసీఆర్ పై భద్రాచలం ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య సీఎం కేసీఆర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది భద్రాచలం పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ అక్కడి ప్రజలకు గోదావరి వరదలతో ముంపు ప్రమాదం ఉన్న నేపథ్యంలో కరకట్ట నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కరకట్ట నిర్మాణం కోసం రూ. 1000 కోట్లు విడుదల చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. వరదలతో నిరాశ్రయులైన బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి.. సంవత్సరం గడిచినా ఆ రెండు హామీలు నెరవేరలేదని ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫిర్యాదులో తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నెరవేర్చడంలో విఫలం అయ్యారని, అందుకే పోలీసుల సహాయాన్ని కోరుతున్నామని ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్నారు.
2022లో గోదావరి వరదలతో భద్రాచలంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవ్వగా భారీగా పంటనష్టం, ఆస్తి నష్టం జరిగింది. వరదలు సంబంధించినప్పుడు పరిస్థితిని సమీక్షించడానికి భద్రాచలం వచ్చిన సీఎం కేసీఆర్ బాధితులకు ఇళ్లు కట్టించి ఇస్తామని, కరకట్ట ఎత్తు పెంచుతామని ప్రకటించారు. కేసీఆర్ హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఒక్కటి నెరవేరలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణానికి మొదటిసారి వచ్చినప్పుడు రూ.100 కోట్లతో రామాలయాన్ని అభివృద్ధి చేస్తానని కేసీఆర్ చెప్పారని.. కానీ ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. భద్రాచలం నియోజకవర్గ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని ఎమ్మెల్యే పొదెం వీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.