వివరణకు మరింత టైమ్ కావాలి..స్పీకర్‌ను కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

పార్టీ ఫిరాయింపునకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌ కుమార్‌ను కోరారు

By -  Knakam Karthik
Published on : 21 Nov 2025 4:13 PM IST

Telangana, Hyderabad, Kadiyam Srihari, Party defection, Assembly Speaker Prasad Kumar

వివరణకు మరింత టైమ్ కావాలి..స్పీకర్‌ను కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపునకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌ కుమార్‌ను కోరారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యుడు కడియం శ్రీహరి తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగిలిన ఎనిమిది మంది తమ సమాధానాలను అఫిడవిట్ రూపంలో అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. ఈ నేపథ్యంలో, ఫిరాయింపు ఫిర్యాదులపై స్పందించాలని కడియం శ్రీహరితో పాటు దానం నాగేందర్‌కు సభాపతి ఇటీవల మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23వ తేదీలోగా అఫిడవిట్ రూపంలో సమాధానాలు సమర్పించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈ క్రమంలో కడియం శ్రీహరి సభాపతిని కలిసి వివరణ ఇవ్వడానికి కొంత సమయం కావాలని కోరారు. మరోవైపు, ఢిల్లీ పర్యటనలో ఉన్న మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ తిరిగి వచ్చిన వెంటనే సభాపతిని కలవనున్నారు. దానం నాగేందర్ కూడా మరికొంత సమయం కోరే అవకాశం ఉంది.

Next Story