సీఎం కేసీఆర్‌తో ముగిసిన కాంగ్రెస్ నేతల భేటీ..!

Congress Leaders Meet CM KCR. సీఎం కేసీఆర్‌తో టీ కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. కొద్దిరోజుల క్రితం అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో

By Medi Samrat  Published on  25 Jun 2021 1:55 PM GMT
సీఎం కేసీఆర్‌తో ముగిసిన కాంగ్రెస్ నేతల భేటీ..!

సీఎం కేసీఆర్‌తో టీ కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. కొద్దిరోజుల క్రితం అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్ కు గురైన మరియమ్మ విషయమై సీఎంను కలిసామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. మరియమ్మ కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, ఆర్థిక సహాయం చేస్తామ‌ని సీఎం కేసీఆర్‌ చెప్పారని భట్టి తెలిపారు. మరియమ్మ కుటుంబానికి ఇల్లు ఇవ్వాలని కోరామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని సీఎం అన్నారన్నారు. లాకప్‌ డెత్‌కు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరామని భట్టి తెలిపారు. సీఎల్పీ నాయకుడు, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్కతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతమ్ తదితరులు శుక్రవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.


ఇదిలావుంటే.. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు డిజిపి మహేందర్ రెడ్డి ని ఆదేశించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గం చింతకానికి చెందిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని సీఎం స్పష్టం చేశారు.

ఈ ఘటనలో మరణించిన మరియమ్మ.. కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం కేసిఆర్ తెలిపారు. కుమారుడు ఉదయ్ కిరణ్ కు ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతో పాటు, రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియాను అందజేయాలని, మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు చెరో 10 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం అందచేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. చింతకాని కి వెల్లి లాకప్ డెత్ సంఘటనా పూర్వాపరాలను తెలుసుకుని బాధితులను పరామర్శించి రావాలని డిజిపీని సీఎం ఆదేశించారు.

మరియమ్మ లాకప్ డెత్ సంఘటనలో పోలీసుల తీరు పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 28వ తేదీన స్థానిక ఎమ్మెల్యే కాంగ్రేస్ శాసన సభా పక్షనేత భట్టి విక్రమార్కతో కలిసి స్థానిక మంత్రి పువ్వాడ అజయ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర్ రావు సహా, జిల్లా కలెక్టర్, ఎస్సీ బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించి రావాలని సీఎం సూచించారు.



Next Story