కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ రెండు రోజుల తెలంగాణ పర్యటన ముగిసింది. ఈ పర్యటనపై టీపీసీసీ మాజీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా స్పందించారు. రాహుల్ గాంధీ పర్యటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపిందని, రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన రాహుల్ గాంధీ పార్టీ శ్రేణుల్లో జోష్‌ను నింపారని ఉత్తమ్ చెప్పారు. పనిచేసే వారికే టికెట్లు వస్తాయన్న రాహుల్ గాంధీ మాటలు పార్టీలో అందరినీ యాక్టివేట్ చేయనుందన్నారు. ఈ దఫా ఎన్నికల్లో ఆరు నెలల ముందుగానే పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
ఇక శుక్రవారం జరిగిన వరంగల్ సభలో రాహుల్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణకు ముఖ్యమంత్రి ఉన్నారని.. కానీ ఆయన ముఖ్యమంత్రి కాదని ఒక రాజు అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ప్రజల సమస్యలు వింటాడని..కానీ రాజు అవేమీ వినడని.. తాను చేయాలనుకున్నది చేస్తాడని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని… గత 8 ఏళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడుదామమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని రాహుల్ చెప్పారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన వారితో ఎలాంటి పొత్తులు ఉండవని చెప్పారు. తెలంగాణలో నియంతృత్వ, నిరంకుశ పాలన పోయి ప్రజాపాలన రావాలని ఆయన పిలుపును ఇచ్చారు.