తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారు
Congress leader Rahul Gandhi tour in Telangana confirmed.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటన
By తోట వంశీ కుమార్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. మే 4న రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. వరంగల్ జిల్లాలో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో రాహుల్ పాల్గొననున్నారు. 5 వ తేదీన బోయినపల్లిలో కార్యకర్తలతో సమావేశం కానున్నారు. రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ పర్యటన ఉంటుందని టీపీసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
రాహుల్ పర్యటనను విజయవతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు మొదలెట్టింది. మరోవైపు తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ శుక్రవారం హైదరాబాద్‌కు రానున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కమిటీ ఛైర్మన్లతో సమావేశమై కీలక సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన సమీక్షించనున్నారు.
కాగా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే గతవారం పార్టీ సీనియర్ నేతలతో ఆయన ఢిల్లీలో సమావేశమయ్యారు. మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, వరి సేకరణ అంశాలపై ఆయన ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలపై తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్, బీజేపీ విధానాలపైన పోరాటాలను ఉధృతం చేయాలని సూచించారు. పార్టీ నేతల మధ్య ఐక్యత ముఖ్యమని, అందరూ కలిసి పార్టీ కోసం పనిచేయాలన్నారు.