తెలంగాణకు ప్రియాంక గాంధీ.. రేపే ఆ రెండు పథకాల ప్రారంభం

రేపు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించనున్నారు.

By అంజి  Published on  26 Feb 2024 5:30 AM GMT
Congress, Priyanka Gandhi , Telangana, Sridharbabu

తెలంగాణకు ప్రియాంక గాంధీ.. రేపే ఆ రెండు పథకాల ప్రారంభం  

ఫిబ్రవరి 27వ తేదీన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు. చేవెళ్లలో జరిగే ప్రియాంక గాంధీ సభను విజయవంతం చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ప్రజలను, కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా చేవెళ్ల గడ్డ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండు పథకాలను ప్రారంభిస్తారని తెలిపారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షల వైద్యసేవలు వంటి పథకాలు పేదలకు మంచి చేస్తాయని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి మన జిల్లాకు వస్తున్నందున ఈ సభను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పని చేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు.

మహాలక్ష్మి పథకం కింద రేపటి నుంచి రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సాధారణ వినియోగదారులతో పాటు ఉజ్వల పథకం లబ్దిదారులనూ ఈ స్కీమ్ కు ఎంపిక చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు రూ.40 సబ్సిడీ అందిస్తోంది. ఈ మొత్తం నేరుగా లబ్దిదారుడి ఖాతాలో జమ అవుతోంది. మహాలక్ష్మి స్కీమ్ కింద గ్యాస్ ధర రూ.500, కేంద్ర సబ్సిడీ రూ.40 పోనూ మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుడి ఖాతాలో జమ కానుంది. ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన వారికీ ఇదే విధానంలో రీయింబర్స్ చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 11.58 లక్షల ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా.. వీరికి ప్రతీ సిలిండర్ పై కేంద్రం రూ.340 రాయితీ ఇస్తోంది. ఈ మొత్తంతో పాటు గ్యాస్ ధర రూ.500 ను మినహాయించి మిగతా సొమ్మును రాష్ట్రప్రభుత్వం వినియోగదారుడి ఖాతాలో వేయనుంది.

Next Story