కేటీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తాం: మల్లు రవి

కేటీఆర్ చేసిన కామెంట్స్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఖండించారు.

By Srikanth Gundamalla  Published on  25 May 2024 4:27 PM IST
congress,  mallu ravi,  brs, ktr ,

 కేటీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తాం: మల్లు రవి 

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి, తీన్మార్‌ మల్లన్నపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఖండించారు. నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్న విషయం తెలిసిందే. కేటీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే ప్రచారంలో భాగంగా కేటీఆర్ విమర్శలు గుప్పిస్తూ, ఆయనపై కేసులు ఉన్నాయని ఆరోపించారు.

బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి బిట్స్‌ పిలానీలో చదివారని.. ఆ కళాశాలలో చదివిన వారే పట్టభద్రులు.. మిగిలినవారు కాదన్నట్లు మాట్లాడటం సరికాదు అని మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను కేటీఆర్ కించపరుస్తూ మాట్లాడారనీ.. ఆయన కామెంట్స్‌ను ఖండిస్తున్నట్లు మల్లు రవి పేర్కొన్నారు. పట్టభద్రులపై బీఆర్ఎస్‌కు ఉన్న వైఖరి ఏంటో వారి మాటల్లోనే తెలుస్తోందని మండిపడ్డారు. ఇక తీన్మార్ మల్లన్న పోటీకి అర్హుడు అంటూ ఎన్నికల సంఘం అధికారులు చెప్పారనీ.. కాబట్టి కేటీఆర్ తన మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇక కేటీఆర్ చేసిన కామెంట్స్‌ను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఈసీని మల్లు రవి కోరారు.

జూన్‌ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియాగాంధీ తెలంగాణకు వస్తున్నారని మల్లు రవి చెప్పారు. ఆమెకు ఘనంగా సన్మానం చేస్తామన్నారు. తెలంగాణ సాధన కోసం పనిచేసిన అన్ని పార్టీలను కూడా వేడుకకు ఆహ్వానిస్తామని చెప్పారు. ఇక 27వ తేదీన జరగబోయే పట్టభద్రుల ఎమ్ఎల్సీ పోలింగ్‌ గురించి సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ మూడు పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతు తెలిపాయి. తీన్మార్ మల్లన్నను గెలిపించేందుకు తీర్మానం చేశాయని మల్లు రవి చెప్పారు. మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ భావజాలాన్ని సమర్ధవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తారని మల్లు రవి చెప్పారు. మండలిలో నిరుద్యోగులు, పట్టభద్రులు, మహిళల గొంతు వినిపిస్తారని మల్లు రవి తెలిపారు.

Next Story