పూనం కౌర్ చేతిని రాహుల్ పట్టుకోవడంపై వివరణ ఇచ్చిన కొండా సురేఖ

Congress Leader Konda Surekha. భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ టాలీవుడ్ నటి పూనం కౌర్

By Medi Samrat  Published on  31 Oct 2022 9:00 PM IST
పూనం కౌర్ చేతిని రాహుల్ పట్టుకోవడంపై వివరణ ఇచ్చిన కొండా సురేఖ

భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ టాలీవుడ్ నటి పూనం కౌర్ చేయి పట్టుకుని నడిచిన ఫోటోలపై విమర్శలు వస్తుండగా.. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ స్పందించారు. రాహుల్ గాంధీ కావాలని పూనం చేతిని పట్టుకోలేదని.. కాంగ్రెస్ పార్టీ మహిళలను గౌరవిస్తుందని అన్నారు. ఇందిరా గాంధీ నుంచి సోనియా గాంధీ వరకు మహిళలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఆడవాళ్లను తల్లిలాగే చూసే పార్తీ తమదని ఆమె గుర్తు చేశారు. పాదయాత్ర చేస్తే జనంతో ఎలా ఉండాలో తెలుస్తుందన్నారు. తప్పులుంటే వేలెత్తి చూపాలి గానీ చిల్లర ప్రయత్నాలు చేయరాదని... బీజేపీ ఆ చిల్లర రాజకీయాలను మానుకోవాలని ఆమె హితవు పలికారు. పూనం చేతిని రాహుల్ పట్టుకున్నారంటూ బీజేపీ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆమె అన్నారు.

ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో భారత్ జోడో యాత్రలో పూనం కౌర్ పాలుపంచుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె రాహుల్ గాంధీ చేతిని పట్టుకుని మరీ యాత్రలో కొంతదూరం నడిచారు. ఈ ఫొటోను పోస్ట్ చేస్తూ బీజేపీ నేత ప్రీతి గాంధీ, తాత నెహ్రూ అడుగుజాడల్లోనే రాహుల్ గాంధీ నడుస్తున్నారంటూ విమర్శించారు. ప్రీతి గాంధీ పోస్టుపై పూనం కూడా స్పందించారు. తాను కిందపడబోతే... రాహుల్ గాంధీ తన చేతిని పట్టుకున్నారని వివరణ ఇచ్చారు. రాహుల్ తన చేయి పట్టుకోవడాన్ని ఎందుకు వివాదం చేస్తున్నారని పూనం ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ పక్క నారీశక్తి అని మాట్లాడుతుంటే బీజేపీ నేతలు ఇలా చేయడం తగదని, ఇది అవమానకరమని పూనం కౌర్ చెప్పారు. చేనేత వస్త్రాలపై విధిస్తున్న జీఎస్టీ పన్నును రద్దు చేయాలన్న అంశంపై తాను రాహుల్ గాంధీతో చర్చించానని పూనం చెప్పారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు కోరుతూ అఖిల భారత పద్మశాలీ సంఘం గడచిన 8 నెలలుగా ఉద్యమం చేపడుతోందని, ఆ ఉద్యమంలో తాను క్రియాశీలకంగా పాల్గొంటున్నానని తెలిపారు. ఇందులో భాగంగా చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు కోసం వీలయినంత ఎక్కువ మంది ఎంపీల సంతకాలు సేకరించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.


Next Story