వీఆర్ఏల సమస్యలు పరిష్కరించండి
Congress Leader Jaggareddy Appeal to CM KCR. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించి వారికి దసరా కానుకగా ఇవ్వాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్
By Medi Samrat
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించి వారికి దసరా కానుకగా ఇవ్వాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ ని కోరారు. వెంటనే వీఆర్ఏ డిమాండ్స్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వీఆర్ఏల పే స్కేల్ పెంచాలి.. ప్రమోషన్స్ ఇవ్వాలని కోరారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వారసులకు ఉద్యోగాల జీవోలు విడుదల చేయాలని అన్నారు. గత మూడు నెలల నుండి వీఆర్ఏలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.
మూడు నెలల నుండి జీతాలు లేవు.. ఇప్పటికే ఒత్తిడి తట్టుకోలేక 28 మంది వీఆర్ఏలు చనిపోయారు. ఇందులో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. అనేక మంది వీఆర్ఏలు ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఈ రాష్ట్రానికి సీఎం.. ఆయనకు కోపం తగదు.. సీఎం అంటే తండ్రి లాంటి పోస్ట్.. పిల్లలపై కోపం వచ్చినా మళ్ళీ వారిని దగ్గరికి తీసుకోవాలని సూచించారు.
ఉన్నతాధికారులు గ్రామాలలో వీఆర్ఏలపై పని భారం వేస్తూ పని తీసుకుంటున్నారని.. దీని వల్ల వీఆర్ఏలు ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నారు.. వీఆర్ఏలు అనారోగ్య సనస్యలు ఎదురుకోవాల్సి వస్తుందని అన్నారు. నా సంగారెడ్డి నియోజకవర్గంలో 250 మంది వీఆర్ఏలు ఉన్నారు. వాళ్ళందరితో నేను నేరుగా మాట్లాడడం జరిగింది.. వారి స్థితిగతులను చూడడం జరిగింది. 100 ఏళ్లు బ్రతకాల్సిన వీఆర్ఏలు 45 నుండి 50 ఏళ్ల వయసుకే పని భారంతో చనిపోతున్నారు. నెలకు ఇచ్చే 12 వేల జీతం వాళ్ల పెట్రోల్ ఖర్చులకు సరిపోతున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో వీఆర్ఏ లను కాపాడాలని.. మీరు ఇచ్చిన వాగ్దానమే కాబట్టి.. మాట నిలబెట్టుకోవాలని సీఎం ను కోరారు.