కేసీఆర్ ప్యాకేజీలో కిషన్ రెడ్డి బీజేపీ ప్రెసిడెంట్ అయ్యారు : జగ్గారెడ్డి
బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ని విమర్శించే ముందు.. నీ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేసుకో కిషన్ రెడ్డి..
By Medi Samrat Published on 22 Feb 2024 3:06 PM ISTబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ని విమర్శించే ముందు.. నీ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేసుకో కిషన్ రెడ్డి.. ఇంగితం లేకుండా మాట్లాడకు అంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్యాకేజీలో అధ్యక్షుడివి అయ్యావు అంటూ కిషన్ రెడ్డి పై ఫైర్ అయ్యారు. నీ కుర్చీనే నువ్వు కాపాడుకోలేక పోయావు.. కాంగ్రెస్ మీద విమర్శలు ఎందుకు బండి సంజయ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ ని విమర్శించే ముందు బీజేపీ హామీల గురించి ఆలోచించుకో అని హితువు పలికారు. ఏది మాట్లాడాలో.. ఏది మాట్లాడకూడదో అనే ఇంగిత జ్ఞానం లేనట్టు అనిపించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలో కి వచ్చి 2 నెలలు అయ్యింది.. 20 కోట్ల మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని వెల్లడించారు. కిషన్ రెడ్డి.. ఉచిత బస్సు ప్రయాణం నిజం కాదా..? నీ కండ్లకు కనిపించడం లేదా..? నీ పార్టీ సంసారమే సక్కగా లేదు.. మా ఇంఛార్జీల గురించి ఎందుకు అని ఫైర్ అయ్యారు.
ఇంఛార్జ్ ల మీద మాట్లాడే నైతిక హక్కు మీకు లేదన్నారు.. ముందు నీ పార్టీ మీద ఉన్న బురద కడుక్కో కిషన్ రెడ్డి అంటూ చురకలంటించారు. ఎన్వీఎస్ఎస్ కు ఎమ్మెల్యేగా ఓడిపోయి మైండ్ ఖరాబ్ అయ్యిందన్నారు. బెంజ్ కారు పెద్ద పనా.. నెలకు లక్ష కడితే బెంజ్ కారు వస్తదన్నారు. బెంజ్ కారు గిఫ్ట్ అనేది నవ్వులాట.. ఏం విమర్శలు చేయాలో కూడా బీజేపీకి తెలియకుండా అయిపోయింది. బీజేపీ నాయకులకు మైండ్ బ్లాక్ అయ్యిందన్నారు. కిషన్ రెడ్డి.. నీ భార్యను ఆర్టీసీ బస్సు ఎక్కించు.. అట్లనైన తెలుస్తదన్నారు.
రాష్ట్రంలో ఏమైతుంది అని తెలుసుకోలేని నువ్వు.. ఏం రాష్ట్ర అధ్యక్షుడివి.. నువ్వేం కేంద్ర మంత్రివి అంటూ ఎద్దేవా చేశారు. నల్లధనం తెస్తా.. పేదల ఎకౌంట్ లో వేస్తా అని మోదీ చెప్పిన మాట గుర్తు లేదా అని ప్రశ్నించారు. మీ పార్టీనే ఇచ్చిన హామీ అమలుచేయలేదు.. మమ్మల్ని ప్రశ్నించే హక్కు నీకు ఎక్కడిదని అడిగారు. 2 కోట్ల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తా అన్నావు.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో చెప్పి.. మమ్మల్ని అడగాలన్నారు.
నేను.. నువ్వు ఇద్దరం కలిసి ఆర్టీసీ బస్సు ఎక్కుదాం.. సోనియాగాంధీ ఇచ్చిన హామీ అమలు అయ్యిందో లేదో అడుగుదాం.. నువ్వు ధైర్యం చేస్తావా అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ మీద బురద జల్లాలి అని బీజేపీ చూస్తోంది. గుర్రం ఎక్కినోడి కథ లెక్క ఉంది కిషన్ రెడ్డి తీరు.. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు.. తర్వాత నీకు సమాధానం చెప్తామన్నారు.
కిషన్ రెడ్డి.. ఆగమేఘాల మీద రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు అయ్యాడని ప్రశ్నించారు. బండి సంజయ్ ని కారణం లేకుండా ఎందుకు తప్పించారు చెప్పు అని ప్రశ్నించారు. కేసీఆర్ ని బండి సంజయ్ తిడుతున్నాడు అని.. కేసీఆర్ ప్యాకేజీలో కిషన్ రెడ్డి బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాడు.. ఇది మీ పార్టీ నేతలు అంటున్న మాట అని వ్యాఖ్యానించారు.
బండి సంజయ్ కి ఆయన కుర్చీ కాపాడుకునే శక్తే ఆయనకు లేదు.. నువ్వు కుర్చీ లో కూసుంటే.. నీకు తెలియకుండానే లాగేశారు. నీకు దాని మీదనే సోయి లేదు.. ప్రజలు కాంగ్రెస్ కు పెట్టిన నోటి కాడి ముద్ద సంగతి ఏం సోయి ఉంది నీకు అని ఎద్దేవా చేశారు. నేను ఓడిపోవచ్చు.. కానీ ప్రజలు సంతోషంగా ఉండే ప్రభుత్వం వచ్చింది.. అది నాకు సంతోషం అన్నారు. జగ్గారెడ్డి పదవుల కోసం ఆశపడడు.. జగ్గారెడ్డి అవసరం ఉంటే.. పార్టీ గుర్తించి పదవి ఇస్తుందన్నారు. 14 ఎంపీ సీట్లు గెలుస్తాం.. అది మా టార్గెట్ అని అన్నారు.