హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారుతుంటే.. ఏం చేస్తున్నారు..?

Congress Leader Bhatti Vikramarka Fire On Telangana Govt. రాష్ట్ర రాజధానిలో జరిగిన బాలిక అత్యాచారం ఘటనలో పోలీసుల దర్యాప్తు నిష్పక్షపాతంగా

By Medi Samrat  Published on  4 Jun 2022 10:27 AM GMT
హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారుతుంటే.. ఏం చేస్తున్నారు..?

రాష్ట్ర రాజధానిలో జరిగిన బాలిక అత్యాచారం ఘటనలో పోలీసుల దర్యాప్తు నిష్పక్షపాతంగా లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు అనుమతించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద ఆయ‌న శ‌నివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధానిలో మైనర్ బాలికపై అత్యాచారం జరగడం దురదృష్టకరం. పబ్, డ్రగ్ కల్చర్ ని నియంత్రించలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఘటనకు బాధ్యత వహించాలని అన్నారు.

మైనర్ బాలిక ను పబ్ నుండి తీసుకెళ్లి క్రూరంగా ప్రవర్తించారు. ఇందులో నిందితులు ఎవరున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ కు భజన చేసే వారికి పబ్ ల అనుమతి ఇస్తున్నారని.. పబ్ లలోకి మైనర్లకు అనుమతి లేదు.. మరి ఎలా అనుమతి చేశారు? మైనర్లకు మద్యం సరఫరా చేయకూడదు అన్న నిబంధన ఉన్నప్పటికీ ఎందుకు ఉల్లంఘించారని ప్ర‌శ్నించారు. పబ్ లకు కు లైసెన్స్ ఇచ్చేటప్పుడు నియంత్రించే ప్రయత్నం చేయకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారుతుంటే.. మీరేం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం,హోంమంత్రిని ప్ర‌శ్నించారు. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా.. అని ప్ర‌శ్నించారు. డ్రగ్స్ కేసును సీబీఐ విచారణకు అప్పగించడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? అని నిల‌దీశారు.

హోం మంత్రి తన విధిని సక్రమంగా నిర్వర్తించరు.. నిర్వర్తించమని అడిగితే అరెస్ట్ చేస్తారా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అత్యాచారం ఘటనపై దోషులను శిక్షించాలని హోంమంత్రి, డీజీపీ ని కలవడానికి వెళ్లిన మా మహిళ కాంగ్రెస్ నేతలను అక్రమ అరెస్టులు చేస్తున్నారని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు భ‌ట్టి వ్యాఖ్యానించారు.

తెలంగాణ తెచ్చుకున్నది మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మడానికేనా? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. మద్యాన్ని ఆదాయ వనరుగా ప్రభుత్వం చూడటం వల్లనే రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిపోతున్నదని విమ‌ర్శించారు. డ్రగ్స్, మద్యం మత్తులో అమ్మాయిలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నా నియంత్రించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింద‌ని విమ‌ర్శించారు. మైనర్ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే నిందితులను అరెస్టు చేయడానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారని.. ఎందుకు హోంమంత్రి, పోలీస్ డిపార్ట్మెంట్ భయపడుతోందని ప్ర‌శ్నించారు. నిందితులు రాజకీయ పలుకుబడి ఉన్నవారైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.



















Next Story