కల్వకుంట్ల కవితపై బండ్ల గణేష్ ఫైర్
ఇంద్రవెల్లిలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితం అని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.
By Medi Samrat Published on 3 Feb 2024 2:45 PM GMTఇంద్రవెల్లిలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితం అని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అమర వీరులకు కూడా కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.500లకే గ్యాస్ పథకం ప్రారంభానికి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకాగాంధీని ఆహ్వానించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రభుత్వ కార్యక్రమానికి ప్రియాంకా గాంధీని ఏ హోదాలో ఆహ్వానిస్తారని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా పలు విషయాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ కవిత.
కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని ఇప్పుడు గుర్తొచ్చిందా?.. పదేళ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశారంటూ ఎమ్మెల్సీ కవితపై బండ్ల గణేష్ విమర్శలు గుప్పించారు. ఎప్పుడైనా బీసీల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడారా? అంటూ ప్రశ్నించారు. సీఎం ప్రజల్లోకి వెళితే మీకు ఇష్టం ఉండదు. గేటు బయటే ఆపేసి బతికున్న గద్దర్‌ను చంపేశారు. ఆయన పేరుమీద కాంగ్రెస్ అవార్డులు ఇస్తుంది. జానారెడ్డి తప్పుకుని కుమారుడికి అవకాశం ఇచ్చారు. మంత్రులను డమ్మీలను చేసింది మీరు కాదా ? అని ప్రశ్నించారు. లిక్కర్ స్కాంతో తెలంగాణ రాష్ట్రాన్ని అపఖ్యాతి పాలు చేసింది మీరు కాదా ? బీసీల కోసం మీ త్యాగం అవసరం లేదు. ఎంపీగా ఓడిపోతే ఏడ్చి ఎమ్మెల్సీ తెచ్చుకున్నారు. మీ పార్టీ ఆఫీసుకు స్థలం ఇస్తే కొండా లక్ష్మణ్ బాపూజీని మీరు పట్టించుకున్నారా ? సీఎం కావాలని మీరు.. కేటీఆర్ ఆశపడ్డారు. అది సాధ్యం కాలేదని.. ఇప్పుడు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని బండ్ల ధ్వజమెత్తారు.