హైదరాబాద్: ప్రత్యర్థుల వేట నుంచి కాపాడేందుకు అవసరమైతే తమ ఎమ్మెల్యేలను తరలించేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో బస్సులను సిద్ధంగా ఉంచింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇతర ఏఐసీసీ పరిశీలకులు క్యాంప్ చేస్తున్న తాజ్‌కృష్ణ హోటల్‌లో ఓ ప్రైవేట్ ట్రావెల్ ఆపరేటర్ బస్సులు కనిపించాయి. కౌంటింగ్ తీరును పరిశీలకులు గమనిస్తూ రాష్ట్ర పార్టీ నేతలకు అవసరమైన సూచనలు చేస్తున్నారు. కర్నాటక మంత్రి కేహెచ్ మునియప్ప మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ పార్టీకి విధేయులుగా ఉన్నందున పార్టీ ఫిరాయించరని అన్నారు.
శివకుమార్‌తో పాటు కొందరు కేబినెట్ సహచరులు శుక్రవారం అర్థరాత్రి బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని సమన్వయం చేసేందుకు శివకుమార్, దీపా దాస్ మున్షీ, డాక్టర్ అజోయ్ కుమార్, కేజే జార్జ్, కే.మురళీధరన్‌లను పరిశీలకులుగా ఏఐసీసీ నియమించింది. కాగా, 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ 70కి పైగా స్థానాలను కైవసం చేసుకుంటుందని ఏఐసీసీ ఇంచార్జి మాణిక్‌రావు ఠాకరే విశ్వాసం వ్యక్తం చేశారు.