ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్

Congress High Command is serious about MP Komati Reddy Venkat Reddy. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, భువ‌న‌గిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ అయ్యింది.

By Medi Samrat  Published on  23 Oct 2022 9:23 AM GMT
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, భువ‌న‌గిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ అయ్యింది. ఈ మేర‌కు ఫోన్ కాల్ లీక్ వ్యవహారంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని 10 రోజుల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరింది. ఈ విష‌య‌మై ఏఐసీసీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ తారీఖ్ అన్వ‌ర్.. వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు ఉల్ల‌ఘించిన‌ మీపై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోకూడ‌దో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని నోటీసుల‌లో కోరింది. ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. అక్క‌డ‌ తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీ గెలవదంటూ మాట్లాడిన వీడియో కూడా వైర‌లైంది. వ‌రుస ప‌రిణామాల నేప‌థ్యంలో పార్టీ హైక‌మాండ్ న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది.

వైర‌ల్ అయిన ఆ ఆడియోలో కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కాంగ్రెస్ నేత‌ల‌కు ఫోన్ చేసి.. త‌న త‌మ్ముడు, బీజేపీ అభ్య‌ర్ధి రాజ‌గోపాల్ రెడ్డికి ఓటేయాల‌ని కోరారు. అంతేకాకుండా.. ఈ దెబ్బ‌తో తాను పీసీసీ ఛీప్ అవుతాన‌ని.. రాష్ట్ర‌మంతా పాద‌యాత్ర చేస్తాన‌ని.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ గ‌వ‌ర్న‌మెంట్‌ను తీసుకొస్తాన‌ని.. ఏమైనా ఉంటే తాను చూసుకుంటాన‌ని వెంక‌ట్‌రెడ్డి హామీ ఇవ్వ‌డం పార్టీ వ‌ర్గాల్లో తీవ్ర క‌ల‌క‌లం రేపింది.

ఇక‌ ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.. అక్క‌డ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు, స‌న్నిహితుల‌తో మాట్లాడారు. ఈ క్ర‌మంలో మునుగోడు ఉప ఎన్నిక‌పై షాకింగ్ కామెంట్లు చేశారు. ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంద‌ని, త‌న త‌మ్ముడు కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి గెలుస్తార‌న్నారు. ఓడిపోయే చోట ప్ర‌చారం చేయ‌డం ఎందుకని అన్నారు. తాను ప్ర‌చారం చేసినా మ‌హా అయితే.. కొన్ని ఓట్లు వ‌స్తాయి తప్ప కాంగ్రెస్ గెల‌వ‌ద‌న్నారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంద‌ని చెప్పారు. రెండు అధికార పార్టీలు కొట్లాడుతున్నప్పుడు మనమేం చేయగలుగుతామ‌న్నారు. తాను 25 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నాన‌ని, ప్ర‌స్తుత రాజ‌కీయాల గురించి తెలుస‌న్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఎంపీ ప‌ని చేస్తున్నా.. అవ‌స‌రం అయితే రాజ‌కీయాల‌కు రిటైర్‌మెంట్ తీసుకుంటాం. రాష్ట్ర‌మంతా తిరిగి పాద‌యాత్ర చేద్దామ‌నుకున్నా.. అయితే కాంగ్రెస్‌లో ఒక్కొక్క‌రిది ఒక్కో గ్రూపు అని కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అన్నారు.





Next Story