తెలంగాణ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో రెండు పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్న లాంఛనంగా ప్రారంభించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకం అమలవుతూ ఉండడంతో తమ బతుకుదెరువు పోతుందని ఆటోడ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇదే విషయమై తెలంగాణ బీఎస్పీ చీఫ్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ప్యాసింజర్లు దొరకక రోడ్ల మీద పడతామేమోనని ఆటో డ్రైవర్లు భయపడుతున్నారని అన్నారు. ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
''ఇప్పుడిప్పుడే నష్టాల్లోనుండి బయటికొస్తున్న ఆర్టీసీ మీద మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలు పెను భారాన్ని మోపబోతున్నది. ఇది దాదాపుగా 50 వేల మంది ఆర్టీసి కార్మికుల జీవితాల మీద కూడా ప్రభావం చూపబోతున్నది. అంతే కాకుండా చాలా గ్రామాలకు ఆర్టీసి బస్సులు తెలంగాణ వచ్చినప్పటినుండి రకరకాల కారణాల వల్ల బందుపెట్టిండ్రు. ఇప్పుడు మళ్లీ ఆ సర్వీసులను పునరుద్దరిస్తారా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మిగిలింది. అదే విధంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు తమకు తగినంత ప్యాసింజర్లు దొరకక రోడ్ల మీద పడతామేమోనని భయపడుతున్నారు. ఊర్లల్లో తగిన పని దొరక్క పట్నాలకు వలస వచ్చి రేకుల షెడ్లలో ఉంటూ కిరాయి ఆటోలను నడుపుతూ పొట్టగడుపుకుంటున్న ఆటో డ్రైవరు సోదరులను ప్రభుత్వమే ఆదుకోవాలి'' అని ప్రవీణ్ కుమార్ అన్నారు.