Telangana: కాంగ్రెస్ తొలి జాబితా ప్రకటన అప్పుడేనా?
ఈసారి రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది.
By Srikanth Gundamalla Published on 26 Aug 2023 10:23 AM ISTTelangana: కాంగ్రెస్ తొలి జాబితా ప్రకటన అప్పుడేనా?
కాంగ్రెస్‌లో ఆశావాహుల దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. 8 రోజుల పాటు సాగిన ఈ ప్రక్రియలో అభ్యర్థులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది. ఇక చివరి రోజు అయితే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అత్యధికంగా ఇల్లందు సెగ్మెంట్ నుంచి 38 దరఖాస్తులు వచ్చాయి. ఇక స్క్రూటీని నిర్వహిస్తున్నారు. జానారెడ్డి, రేణుక చౌదరి, నాగం జనార్ధనరెడ్డి, గీతారెడ్డి టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదు.
కాగా.. ఈసారి రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. కర్ణాటక ఎన్నికల జోష్‌ను తెలంగాణలోనూ కంటిన్యూ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే త్వరగా జాబితాను సిద్ధం చేసి ప్రజల్లోకి వెళ్లాలని ఆలోచిస్తుంది. అందుకే అప్పుడే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. మధిర అసెంబ్లీ స్థానానికి భట్టి విక్రమార్క, సంగారెడ్డి నుంచి జాగ్గారెడ్డి తరఫున భార్య దరఖాస్తు చేసుకున్నారు. నాగార్జున సాగర్ టికెట్ కోసం జానారెడ్డి ఇద్దరు కుమారులు.. కరీంనగర్ నుంచి నుంచి రమ్యారావు, కుమారుడు రితేష్ దరఖాస్తు చేసుకున్నారు. ఎల్‌బీ నగర్ నుంచి మధుయాష్కీ, హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్, కోదాడ నుంచి పద్మావతి, నల్లగొండ నుంచి కోమటిరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.
కాగా.. ఇప్పటికే అధికారపార్టీ అభ్యర్థులను 95 శాతం సీఎం కేసీఆర్ ప్రటించారు. ఈ క్రమంలో ప్రచారం సహా ఇతర ఏ కార్యక్రమాల్లోనూ తాము వెనుకపడొద్దని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక అభ్యర్థుల తొలి జాబితాపై కసరత్తు పూర్తి చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. జాతీయ నాయకత్వానికి పంపిస్తారు. హైకమాండ్ ఆమోదం తెలిపిన తర్వాతే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనాయకులతో తెలంగాణలో సభలు, సమావేశాలు నిర్వహించాలని అధినాయకత్వం భావిస్తోంది. అయితే.. సెప్టెంబర్ 10 తేదీన కాంగ్రెస్ తన తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ జాబితాలో 119 నియోజకవర్గాలకు గాను.. దాదాపు సగం మందిని ప్రకటించే చాన్స్ ఉంది. ఇక రెండో జాబితాను కాంగ్రెస్‌లో చేరికలు.. ఆశావాహులను బట్టి నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మల్లికార్జున ఖర్గే కూడా తెలంగాణలో పర్యటించనున్నారు. చేవెళ్లలో భారీ బహిరంగ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ సభ నుంచే ఖర్గే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. భారీ బహిరంగ సభకు పార్టీ నేతలు మమ్మురంగా ఏర్పాట్ల చేశారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభను విజయవంతం చేసేందుకు సుమారు లక్ష మంది జనాలను తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.