కాంగ్రెస్ అధిస్టానం తెలంగాణ నుంచి రాజ్యసభకు ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్ధి పేరును ప్రకటించడంతో ఊహాగానాలకు తెరపడింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ ఉప ఎన్నిక బరిలో ఉండనున్నట్లు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కే కేశవరావు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడంతో జూలై ప్రారంభం నుండి ఆ స్థానం ఎవరు భర్తీ చేయనున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అభిషేక్ మను సింఘ్వీ పేరు ప్రకటించడంతో వాటికి తెరపడింది. అభిషేక్ మను సింఘ్వీ గతంలో పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. వృత్తిరీత్యా న్యాయవాది.
తొమ్మిది రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా సహా సిట్టింగ్ సభ్యులు లోక్‌సభకు ఎన్నికైనందున పది రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆగస్టు 14న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్ దాఖలుకు ఆగస్టు 21 చివరి తేదీ. సెప్టెంబరు 3న ఒక్కో రాజ్యసభ స్థానానికి వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.