మునుగోడు ఉప ఎన్నిక‌ : నామినేష‌న్ దాఖ‌లు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి

Congress candidate Palvai Sravanthi filed nomination. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిని పాల్వాయి స్రవంతి శుక్ర‌వారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

By Medi Samrat  Published on  14 Oct 2022 10:51 AM GMT
మునుగోడు ఉప ఎన్నిక‌ : నామినేష‌న్ దాఖ‌లు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిని పాల్వాయి స్రవంతి శుక్ర‌వారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి, సీనియ‌ర్ నేత‌లు భ‌ట్టి విక్ర‌మార్క‌, జానా రెడ్డి, సీత‌క్క‌, మ‌ధుయాస్కీ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. నామినేష‌న్ వేసిన‌ అనంత‌రం పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నికలు ధన బలానికి, ప్రజా బలానికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా పేర్కొన్నారు. ప్రజలను నైతికంగా వంచించి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. నేను మీ ఆడబిడ్డను.. ఈ ధర్మ యుద్ధంలో నన్ను గెలిపించండని కోరారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేస్తాన‌ని.. కొంగు చాచి అడుగుతున్నా.. ఒక్కసారి అవకాశం ఇవ్వండని ఓటు అభ్య‌ర్ధించారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇది మనందరం లోతుగా ఆలోచించాల్సిన సమయం. మనకు ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు ఆలోచన. టీఆర్ఎస్, బీజేపీ రకరకాల ప్రచారాలు చేస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ లు ఇచ్చిన హామీలు నెరవేర్చాయా? అని ప్ర‌శ్నించారు. ఒక్కసారి ఆలోచోంచండి. ఇచ్చిన హామీలను నెరవేర్చని వారు మిమ్మల్ని ప్రలోభ పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. ప్రలోభాలకు లొంగకుండా ఆలోచించి ఓటు వేయండి. హామీలు నెరవేర్చి అభివృద్ధి చేసిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేన‌ని పేర్కొన్నారు.

ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లుగా దోపిడీ చేస్తున్న టీఆర్ఎస్, బీజేపీ లను మునుగోడు పొలిమేరలదాకా తరిమికొట్టండని పిలుపు నిచ్చారు. ఆడబిడ్డను దీవించి గెలిపించండి. అసెంబ్లీలో అడబిడ్డలం మేమిద్దరం పులి బిడ్డలై గర్జించాలంటే.. స్రవంతిని గెలిపించండని కోరారు. మునుగోడు గడ్డ.. కాంగ్రెస్ అడ్డా అని అభివ‌ర్ణించారు. పుట్టుక నుంచి చావు దాకా జీఎస్టీ పేరుతో పేదలపై బీజేపీ భారం మోపుతోంది. ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోంది. రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయి మునుగోడు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమ‌ర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఈ ఎన్నిక ఒక పునాదిలాంటిదని.. ఒక్క అవకాశం మీ ఆడబిడ్డకు ఇవ్వండి.. నాకు తోడుగా అసెంబ్లీకి పంపండని కోరారు.


Next Story
Share it