కాంగ్రెస్, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)లు ముస్లిం లీగ్ అజెండాను అనుసరిస్తున్నాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం నాడు ఆరోపించారు. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఏఐఎంఐఎం తబ్లిగీ జమాత్‌కు మద్దతుదారులని అన్నారు. మూడు పార్టీలు రజాకార్ల మద్దతుదారులని అన్నారు. కేంద్రంలో మూడోసారి మోదీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్ రూం హామీని బీజేపీ పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు. నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కేంద్రం అందించిన పీఎంజేవై పథకాన్ని వినియోగించుకోలేకపోయారని, ఇప్పుడు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కూడా అదేబాటలో నడుస్తున్నారని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని భారత్ ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా మారుతుందని అన్నారు. ఇప్పటికే ఫార్మా, పెట్రో కెమికల్స్ రంగాల్లో మన దేశం రెండో స్థానంలో ఉందని తెలిపారు. నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్వదేశంలోనే మొబైల్ ఫోన్ల తయారు చేస్తున్నామని తెలిపారు.ఇప్పటివరకు దేశంలో 56 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించామని, 52 వేల కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల విద్యుద్డీకరణ పూర్తయిందని అన్నారు. ప్రపంచంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఐదోస్థానంలో ఉందని తెలిపారు.