హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో గందరగోళం నెలకొంది. తమకు నచ్చిన విస్తీర్ణంలో ఇళ్లు కట్టుకోవచ్చని గతంలో చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు అందుకు ఒప్పుకోవడం లేదు. 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఇళ్లకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఆర్థిక సాయం అందుతుందని అధికారులు చెబుతున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో 70,122 ఇళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పటికే 2,800 మంది పునాది వరకు నిర్మాణం చేపట్టారు. వీరిలో సుమారు 300 మంది 600 చదరపు అడుగులకు మించి ఇళ్లు నిర్మిస్తున్నారు.
అధికారులు కొత్తగా జారీ చేసిన నిబంధనలపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద.. ఇంటిని 600 చదరపు అడుగుల్లోపు నిర్మిస్తేనే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ స్పష్టం చేశారు. 600 దాటితే పథకానికి అనర్హులని తెలిపారు. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను 400 నుంచి 600 ఎస్‌ఎఫ్‌టీ లోపే నిర్మించాలని సూచించారు. 600 చదరపు అడుగుల దాటితే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అనర్హులు అవుతారని తెలిపారు.