గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. సీఈఓ వికాస్ రాజ్ ను కలిసిన పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్, పీసీసీ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యుడు పి.రాజేశ్ కుమార్ చర్యలు తీసుకోవాలని విఙప్తి చేశారు. శాసన మండలి చైర్మన్ గా ఉండి శుక్రవారం రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ లోని ఆయన చాంబర్ లో పత్రికల వారితో మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ 20 వేల ఓట్ల తో గెలుస్తుందని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. అది ఎన్నికల కోడ్ కు పూర్తిగా విరుద్ధం.
రాజ్యాంగ పరమైన పదవిలో ఉండి పార్టీలకు అతీతంగా భాద్యతలను నిర్వహించాల్సిన మండలి ఛైర్మన్ టీఆర్ఎస్‌కు అనుకూలంగా మాట్లాడడమే కాకుండా.. అందుకు లెజిస్లేటివ్ కౌన్సిల్ లోని తన చాంబర్ ను ఉపయోగించుకోవడం తీవ్రమైన నేరమని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఆయనపై వెంటనే ఎన్నికల నిబంధనలను ఉల్లఘించినందుకు కఠిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12వ తేదీన కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా ద్వారా టీఆర్ఎస్ కు ఓటేయాలని ఓటర్ల కు విఙప్తి చేసినట్లు పేర్కొన్నారు.