హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఊరటనిచ్చే వార్త చెప్పారు. ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. వర్షాలు, వరదలకు భారీగా పంట నష్టం జరిగిందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పర్యటించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నడూ పరిహారం చెల్లించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు.
నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం, సహాయక చర్యలపై పెన్ గంగా గెస్ట్ హౌజ్ లో జిల్లా స్థాయి అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులకు తగిన సూచనలు చేస్తూ, వరద నష్టంపై శాఖల వారీగా సమగ్రమైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం విడుదల చేస్తామని చెప్పారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, కాల్వలకు గండ్లు పడ్డ చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. దెబ్బతిన్న రోడ్లను తక్షణమే మరమ్మతులు చేయాలని, విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్పష్టం చేశానే. వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి జూపల్లి ఆదేశించారు.