చలిగాలుల ఎఫెక్ట్.. స్కూలు సమయాలలో మార్పులు
చలిగాలుల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా పాఠశాలల వేళలను అధికార యంత్రాంగం సవరించింది.
By Medi Samrat Published on 18 Dec 2024 2:45 PM GMTచలిగాలుల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా పాఠశాలల వేళలను అధికార యంత్రాంగం సవరించింది. మునుపటి షెడ్యూల్ ఉదయం 9:15 నుండి సాయంత్రం 4:15 వరకు ఉండగా.. సవరించిన వేళల ప్రకారం ఉదయం 9:40 నుండి సాయంత్రం 4:30 వరకు పాఠశాలలు నడవనున్నాయి. డిసెంబర్ 18 బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు ఈ మార్పు అమలు జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBV), మోడల్ పాఠశాలలతో సహా ఆదిలాబాద్‌లోని అన్ని విద్యా సంస్థలకు ఈ కొత్త సమయాలు వర్తిస్తాయి.
సవరించిన సమయాలను కచ్చితంగా అమలు చేయాలని మండల విద్యాశాఖాధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసినట్లు నోటీసులో పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలను పాటించకుంటే తీవ్ర చర్యలు ఉంటాయని ఉత్తర్వులలో హెచ్చరించారు.
IMD హైదరాబాద్ ప్రకారం.. చలిగాలులు రాష్ట్రంలోని పలు జిల్లాలను ప్రభావితం చేస్తున్నాయి. అత్యధిక ప్రభావిత ప్రాంతాలలో ఆదిలాబాద్, కామారెడ్డి, కుమురం భీమ్, మంచిర్యాలు, మెదక్, నిర్మల్ ఉన్నాయి. ఆదివారం ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 6.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే ఇప్పటివరకు కనిష్ట ఉష్ణోగ్రత.