తెలంగాణ తల్లిపై సీఎం రేవంత్‌ కీలక ప్రకటన

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి.

By అంజి  Published on  9 Dec 2024 7:24 AM GMT
CM Revanth, Telangana Talli, Telangana , Hyderabad

తెలంగాణ తల్లిపై సీఎం రేవంత్‌ కీలక ప్రకటన

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్‌ 9వ తేదీ తెలంగాణలో పర్వదినం అని పేర్కొన్నారు. తెలంగాణ తల్లిని అధికారికంగా ఇప్పటి వరకు గౌరవించుకోలేదని చెప్పారు. తెలంగాణ మాతృమూర్తిని గౌరవించాలనే లక్ష్యంతో సచివాలయ ప్రాంగణంలో ఆ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని తాము సంకల్పించినట్టు పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ, సమ్మక్క, సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన జరిగిందని చెప్పారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తురూపం తెలంగాణ తల్లి అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు.

తెలంగాణ తల్లి పీఠంలో నీలి రంగు కృష్ణ, గోదావరి నదులకు సంకేతమని వెల్లడించారు. పదేళ్ల పాటు తెలంగాణకు రాష్ట్రీయ గీతమే లేకుండా పోయిందని సీఎం రేవంత్‌ తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 'జయ జయ హే తెలంగాణ' గీతానికి రాష్ట్ర గీతంగా అధికారిక గుర్తింపు కల్పించామని పేర్కొన్నారు. తెలంగాణను కాపాడుకోవడమే తమ లక్ష్యమని చెప్పారు. చరిత్ర ఉన్నంతవరకు తెలంగాణ తల్లి ఉండాలనే ఆ తల్లికి గుర్తింపు ఇస్తున్నట్టు వెల్లడించారు.

ఇవాళ సాయంత్రం 6.05 గంటలకు సచివాలయ ప్రాంగణంలో జరగనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు పార్టీలకు అతీతంగా అందరూ హాజరుకావాలని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌ ఆహ్వానించారు. ఈ ఒక్క రోజు రాజకీయాలు పక్కనపెట్టి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను స్వాగతించాలని పేర్కొన్నారు. స్వరాష్ట్ర పోరాట ప్రస్థానంలో సకల జనులను ఐక్యం చేసింది తెలంగాణ తల్లి అని అన్నారు. తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదని.. 4 కోట్ల బిడ్డల భావోద్వేగమని అన్నారు. ప్రజల మనోఫలకాల్లో నిలిచిన రూపాన్ని సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరించుకుంటున్నాం అని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Next Story