ఆరు గ్యారంటీలపై సీఎం రేవంత్‌ తొలి సంతకం

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్‌ రెడ్డి రెండు ఫైల్‌లపై సంతకాలు చేశారు.

By అంజి  Published on  7 Dec 2023 2:36 PM IST
CM Revanth Reddy, six guarantees, Congress Govt, Telangana

ఆరు గ్యారంటీలపై సీఎం రేవంత్‌ తొలి సంతకం

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్‌ రెడ్డి రెండు ఫైల్‌లపై సంతకాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగానే ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్‌ తొలి సంతకం చేశారు. అనంతరం దివ్యాంగురాలు రజినీ ఉద్యోగ నియామక ఉత్తర్వులపై రెండో సంతకం చేశారు. ఆ నియామకపత్రాన్ని ఆమెకు అందించారు.

ఆరు గ్యారంటీలు

1. మహాలక్ష్మి స్కీమ్ - మహిళలకు ప్రతి నెలా రూ. 2,000 సాయం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్.

2. రైతుభరోసా - రైతులు, కౌలురైతులకు ఏటా రూ. 15,000 పంట పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000 సాయం, వరి పంటకు ప్రతి క్వింటాల్‌కు రూ. 500 బోనస్.

3. గృహజ్యోతి - ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు.

4. ఇందిరమ్మ ఇండ్లు - ఇల్లు లేనివారికి ఇంటి స్థలంలో నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం.,ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల స్థలం కేటాయింపు.

5. యువ వికాసం - విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్.

6. చేయూత - నెలకు రూ. 4,000 చొప్పున పింఛను, రూ. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంతో అనుముల రేవంత్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క మల్లు ప్రమాణ స్వీకారం చేశారు. దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, జూపల్లి, కృష్ణ పొంగులేటి 10 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్‌పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన డిప్యూటీ డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. అసెంబ్లీ బలం ప్రకారం తెలంగాణలో ముఖ్యమంత్రితో సహా 18 మంది మంత్రులు ఉండవచ్చు. తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం, సంఖ్య పెరగడంతో భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) నుంచి కాంగ్రెస్‌ అధికారాన్ని చేజిక్కించుకుంది.

Next Story