Telangana: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్
అన్ని రెగ్యులర్ కాలేజీల మాదిరే ఓపెన్ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకూ ఇకపై ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు.
By అంజి Published on 26 Jan 2025 2:52 PM ISTTelangana: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్
అన్ని రెగ్యులర్ కాలేజీల మాదిరే ఓపెన్ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకూ ఇకపై ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని డా.అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో సమావేశం సందర్భంగా ఈ ప్రకటన చేశారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఓపెన్ వర్సిటీలో ఫీజులు చాలా తక్కువే ఉంటాయని, ఇది ప్రభుత్వానికి పెద్ద భారమేమీ కాదన్నారు. ఆయా వివరాలను వెంటనే సేకరించాలని సీఎస్‌ను రేవంత్ ఆదేశించారు.
రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు పదేళ్లు పాలించే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్టు సీఎం రేవంత్ తెలిపారు. వర్సిటీల పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. వీసీలుగా అన్ని సామాజిక వర్గాల వారు ఉండాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. వర్సిటీల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని వీసీలను ఆదేశించారు. యూజీసీ ద్వారా వీసీల నియామకాలు చేపట్టాలని కేంద్రం కుట్ర చేస్తోందన్నారు.
అటు 'పద్మ' అవార్డుల ప్రకటనలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపించిందని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విమర్శించారు. పక్క రాష్ట్రానికి ఐదు అవార్డులు ఇచ్చినప్పుడు మాకు ఒకటి తక్కువతో నాలుగు ఇచ్చినా రాష్ట్ర పెద్దలందరికీ గౌరవం దక్కేదని అన్నారు. తొందర్లోనే దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాయబోతున్నానని తెలిపారు. అన్యాయం జరిగినప్పుడు నిరసన తెలపాల్సిన అవసరం ఉందన్నారు. దీన్ని ప్రజాస్వామ్యయుతంగా తెలియజేస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు.