వివిధ జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్‌గా ఆవిష్కరించిన సీఎం

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల కలెక్టరేట్ల ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాలను హైదరాబాద్ లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు

By -  Knakam Karthik
Published on : 9 Dec 2025 11:39 AM IST

Telangana, CM Revanthreddy, Telangana Thalli statue, Global Summit,

వివిధ జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్‌గా ఆవిష్కరించిన సీఎం

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల కలెక్టరేట్ల ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాలను హైదరాబాద్ లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. డిసెంబర్ 9, 2009న సోనియా గాంధీ నేతృత్వంలో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రోజు ఇది. ఆ ప్రకటన తెలంగా ప్రజలకు సంతోషాన్ని ఇచ్చింది.. ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. అందుకే ప్రజా ప్రభుత్వంలో ఈ రోజుని తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం..అని సీఎం వ్యాఖ్యానించారు.

అందులో భాగంగానే గత ఏడాది సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి పరిపాలనలో ఒక స్ఫూర్తి తీసుకొచ్చాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించుకున్నాం. 2004 లో కరీంనగర్ గడ్డపై నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని సోనియా గాంధీ మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన సోనియా గాంధీ జన్మదిన ఉత్సవాలను జరుపుకుంటాం..అని సీఎం పేర్కొన్నారు.

సచివాలయంలో ఏర్పాటు చేసిన తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం రూ. 5.80 కోట్లు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంప్రదాయ పల్లెటూరి మహిళా రైతు రూపంలో తీర్చిదిద్దారు. పసుపుపచ్చ అంచుతో కూడిన ఆకుపచ్చ చీర, నుదుటన ఎర్రని బొట్టు, కాళ్లకు కడియాలు, ముక్కుపుడక, మట్టి గాజులు, గుండు పూసల హారంతో అలంకరించారు. ఎడమ చేతిలో మొక్కజొన్న, గోధుమ, సజ్జ కంకులు పట్టుకుని చిరునవ్వుతో కనిపించేలా విగ్రహాన్ని రూపొందించారు. భూమి నుంచి మొత్తం 18 అడుగుల ఎత్తులో (12 అడుగుల విగ్రహం, 6 అడుగుల దిమ్మె) ఈ విగ్రహం ఉండనుంది. ఒక్కో విగ్రహం తయారీకి సుమారు రూ.17.50 లక్షలు ఖర్చు చేశారు. డిసెంబర్ 9వ తేదీని "తెలంగాణ తల్లి దినోత్సవం"గా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే నేడు విగ్రహాలను ఆవిష్కరించారు.

Next Story