2047 నాటికి తెలంగాణను అలా మారుస్తాం: సీఎం రేవంత్
హైదరాబాద్: లైఫ్ సైన్సెస్‌కు తెలంగాణ కేంద్రంగా ఉంది..అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik
2047 నాటికి తెలంగాణను అలా మారుస్తాం: సీఎం రేవంత్
హైదరాబాద్: లైఫ్ సైన్సెస్‌కు తెలంగాణ కేంద్రంగా ఉంది..అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బయోడిజైన్ ఇన్నవేషన్ సమ్మిట్ 2025 సదస్సులో సీఎం పాల్గొని మాట్లాడుతూ.. దేనినైనా మనం రూపొందిస్తే దాని ప్రయోజనం , పనితీరు, రూపం ప్రాథమిక అంశాలుగా ఉంటాయి. దేవుడు గొప్ప డిజైనర్. ప్రకృతి ఉత్తమ గురువు. మనం మంచి విద్యార్థులమా లేదా అన్నదే ప్రశ్న. లైఫ్ సైన్సెస్‌లో, వైద్యంలో, ప్రకృతి ఉత్తమ గురువు. మనం ప్రకృతి నుంచి నేర్చుకుంటే, మనం తప్పు చేయొద్దు. కృత్రిమ మేధస్సు బయోడిజైన్‌కు మంచి ఉదాహరణ . మానవులు కృత్రిమ మెదడును సృష్టించడానికి సహజ మెదడును ఉపయోగించారు. మేము తెలంగాణ రైజింగ్ 2047 అనే ప్రయాణాన్ని ప్రారంభించాము. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం. దేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకునే 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం..అని సీఎం తెలిపారు.
తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సాధించడంలో వైద్య పరికరాలు, మెడ్‌టెక్ కీలకమైనవి. ఫార్మా, బయోటెక్, లైఫ్ సైన్సెస్ , మెడ్‌టెక్ వంటివి హైదరాబాద్‌లో అత్యంత కీలకమైనవి. తయారీ రంగం నుంచి ఆవిష్కరణలకు కేంద్రంగా తెలంగాణను మారుస్తున్నాం. సుల్తాన్‌పూర్‌లో 302 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైసెస్ పార్క్‌ను ఏర్పాటు చేశాం. ఈ పార్క్ లో పరిశోధన , పరీక్ష, తయారీ కోసం ఉత్తమ మౌలిక సదుపాయాలను అందిస్తున్నాం. ఇక్కడ 60 కి పైగా దేశీయ, అంతర్జాయతీయ కంపెనీలు పనిచేస్తున్నాయి. డయాగ్నస్టిక్ పరికరాలు, ఇమేజింగ్ టెక్నాలజీలు, ఇంప్లాంట్లు, శస్త్రచికిత్స పరికరాలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్‌లో పెట్టుబడులు వస్తున్నాయి. స్థానిక స్టార్టప్‌లు, MSMEలు గ్లోబల్ కంపెనీలతో పాటు కలిసి పనిచేస్తున్నాయి. చాలా ఏళ్లుగా మన మేథస్సుని ఇతర దేశాల ప్రజల కోసం ఉపయోగిస్తున్నాం.. ఇప్పుడు మన ప్రజల మంచి కోసం పనిచేయాల్సిన సమయం వచ్చింది. మా ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. అవసరమైన సహకారాన్ని అందిస్తాం. డేటా గోప్యతను పాటిస్తూనే ఇక్కడ ప్రజల వైద్యసహాయం కోసం అవసరమైన డేటాను అందజేస్తాం. స్కిల్ యూనివర్సిటీ, కార్పొరేషన్లు, విద్యా సంస్థలు, రీసెర్చ్ సెంటర్స్ తో అనుసంధానం చేస్తాం. ప్రస్తుతం ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు కనిపిస్తున్నాయి. పన్నులు, యుద్ధాలు, వాణిజ్యపరమైన అడ్డంకులు వంటివి ఎదురవుతున్నాయి. ఈ సమయంలో ఆవిష్కరణలు చేయడానికి సరైన వేదిక తెలంగాణ. మానవాళిని మరింత ఆరోగ్యంగా మార్చడానికి మనందరం ప్రయత్నం చేద్దాం..అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.