ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జిల్లాలోని భోరాజ్ మండలం హతిఘాట్ గ్రామంలో చనాక-కొరాట పంప్ హౌస్‌ను సీఎం ప్రారంభిస్తారు. అనంతరం నిర్మల్ జిల్లా మామడ మండలం పొంకల్ గ్రామంలో సదర్మట్ బ్యారేజీని ప్రారంభించి యాసంగి పంటలకు నీటిని విడుదల చేస్తారు. మరో వైపు రూ. 386.46 కోట్లతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నిర్మల్ పట్టణంలోని NTR స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరుకానున్నారు.
అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక సీఎం రేవంత్ రెడ్డి అన్ని కార్యక్రమాలను ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభించటం ఆనవాయితీగా వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ స్థూపాన్ని సందర్శించిన ఆయన, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నట్లు ప్రకటించడం ఆశలను చిగురింపజేసింది. తాజాగా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నందున నేడు సీఎం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించనున్నారు.