తెలంగాణలో కులగణన నిర్వహిస్తామని, బీసీ కులాల లెక్కలు తీస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌కు కట్టుబడి ఉన్నామని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై తగిన నిర్ణయం తీసుకుంటామని తనను కలిసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తో రేవంత్ వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుకు న్యాయపరమైన చిక్కులపై త్వరలోనే సమావేశమై చర్చిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణలో బీసీల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వెంటనే కులగణన చేపట్టాలని సీఎం రేవంత్‌ను జాజుల కోరారు.
బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని, బీసీ విద్యార్థులకు పూర్తి స్టడీ రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాజుల కోరారు. రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందని తెలిపారు. దీనిపై సీఎం మాట్లాడుతూ.. కులగణనపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుదలకు సంబంధించి న్యాయపరమైన అంశాలున్నందున ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఎన్నికలపై చర్చిస్తామని తెలిపారు.