22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు.. శంకుస్థాపన చేయనున్న సీఎం

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది కాలంలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, వివిధ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచించారు.

By అంజి  Published on  15 Nov 2024 3:00 AM GMT
CM Revanth Reddy, Indira Mahila Shakti Bhavan , Telangana

22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు.. శంకుస్థాపన చేయనున్న సీఎం

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది కాలంలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, వివిధ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్న నేపథ్యంలో చేపట్టనున్న “ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ” కార్యక్రమాలపై సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు.

ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించి డిసెంబర్ 9 వరకు చేపట్టనున్న కార్యక్రమాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఏడాది కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందున వాటన్నంటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మూడు ప్రాంతాలు వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తారు.

మహిళల సాధికారత, రైతుల సంక్షేమం, యూత్ ఎంపవర్‌మెంట్‌కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో వాటికి సంబంధించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతారు. ఈ నెల 19న వరంగల్ వేదికగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ ట్యాంక్‌బండ్, సెక్రటేరియట్, నెక్లెస్‌రోడ్ పరిసరాల్లో విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తారు.

సీఎం చేతుల మీదుగా డిసెంబర్ 9న సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆహ్వానం పంపనున్నారు. ఈ విజయోత్సవాల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలు, కార్యక్రమాలపై శాఖలు, విభాగాల వారిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

Next Story