Telangana: నేడే ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం.. రూ.5 లక్షల సబ్సిడీ
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరో కీలకడుగు పడనుంది. సీఎం రేవంత్ రెడ్డి నేడు మొదటి విడత కింద మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు.
By అంజి
Telangana: నేడే ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం.. రూ.5 లక్షల సబ్సిడీ
హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరో కీలకడుగు పడనుంది. సీఎం రేవంత్ రెడ్డి నేడు మొదటి విడత కింద మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసి ఇంటి నిర్మాణాలను ప్రారంభించనున్నారు. కాగా ప్రభుత్వం తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 72,045 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. వాటన్నింటికీ రేపు శంకుస్థాపనలు మొదలు కానున్నాయి.
ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. బేస్‌మెంట్ కట్టగానే రూ. లక్ష లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తారు. కాగా తొలి విడతలో సొంతస్థలం ఉన్న వారికే ఇళ్లను కేటాయించింది. ఈ పథకం కింద బేస్‌మెంట్ లెవల్‌లో రూ.లక్ష, గోడలు నిర్మించాక రూ.1.25లక్షలు, స్లాబ్ పూర్తయిన తరువాత రూ.1.75లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష కలిపి మొత్తం నాలుగు దశల్లో రూ.5లక్షల ఆర్థికసాయం అందజేయనుంది.
ఇళ్ల పథకానికి శంకుస్థాపన తర్వాత అప్పక్‌పల్లిలోనే జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. మహిళల ఆధ్వర్యంలోనే నడిచే బంకు రాష్ట్రంలోనే ఇది మొదటిది కానుంది. తదనంతరం నారాయణపేట మెడికల్ కాలేజీ అకడమిక్ బ్లాక్, ఇతర భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్న తీరుపైనా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నాం 2 గంటలకు గురుకుల హాస్టల్ ఆవరణలో బహిరంగ సభలో పాల్గొని, ప్రసంగించనున్నారు.