మహిళలకు గుడ్‌న్యూస్‌.. నేడే ఇందిరా మహిళా శక్తి మిషన్‌ ఆవిష్కరణ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో లక్ష మందితో ప్రభుత్వం సభ నిర్వహించనుంది.

By అంజి
Published on : 8 March 2025 6:41 AM IST

CM Revanth Reddy , Indira Mahila Shakti Mission, Telangana

మహిళలకు గుడ్‌న్యూస్‌.. నేడే ఇందిరా మహిళా శక్తి మిషన్‌ ఆవిష్కరణ

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు వరాల జల్లు కురిపించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో లక్ష మందితో ప్రభుత్వం సభ నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి మిషన్‌ - 2025ను సీఎం రేవంత్‌ రెడ్డి ఆవిష్కరిస్తారు. సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళల్ని కోటీశ్వరుల్ని చెయ్యడమే లక్ష్యంగా వారి కోసం చాలా పథకాలు అమలు చేస్తోంది.

కాగా ఇటీవలే ఇందిరా మహిళా శక్తి మిషన్ - 2025 కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సెర్ప్‌, మెప్మాలను విలీనం చేసి కోటి మంది మహిళలకు రూ.లక్ష కోట్ల రుణం అందించడమే దీని ఉద్దేశం. ఇకపై.. ఈ మహిళా సంఘాలన్నీ ఒకే వ్యవస్థ కింద పనిచేస్తూ.. అభివృద్ధికి మరింత దోహదపడతాయి. అలాగే మహిళల ఆధ్వర్యంలో 150 బస్సులను ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన అందించనున్నారు. తదుపరి దశలో.. మరో 450 బస్సులు చేర్చుతూ.. మొత్తం 600 బస్సులు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడపనున్నారు.

31 జిల్లాల్లో పెట్రోల్‌ బంకులను సీఎం రేవంత్‌ ప్రారంభిస్తారు. ఇప్పటికే పెట్రోల్ బంకులు ఏర్పాటయ్యేలా చమురు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇటీవల ఒక పెట్రోల్ బంక్ మహిళల ద్వారా ప్రారంభమైంది. ఇక ఇదే సభలో మహిళా సంఘ సభ్యులకు లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కులను ఇస్తారు. ఇంకా మహిళా సంఘాలకు రుణ సదుపాయిన్ని కల్పిస్తూ చెక్కులను జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులకు ఇస్తారు. సభ సాయంత్రం 5 నుంచి 6 మధ్యలో ఎప్పుడైనా ప్రారంభం కాగలదు. రాత్రి 7.30కల్లా సభను ముగించేలా ప్లాన్ ఉంది.

Next Story