పంచాతీయ ఎన్నికల ఫలితాలపై రేపు మంత్రులతో సీఎం రేవంత్ కీలక భేటీ
రేపు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు.
By - Knakam Karthik |
పంచాతీయ ఎన్నికల ఫలితాలపై రేపు మంత్రులతో సీఎం రేవంత్ కీలక భేటీ
హైదరాబాద్: రేపు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారిగా సమీక్ష చేపట్టనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తక్కువ ఫలితాలు సాధించిన నియోజకవర్గాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. కాగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం. దీంతో ఫోన్‌లో మాట్లాడి ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కొన్ని ఏరియాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు తమ పద్దతి మార్చుకోవాలని సీఎం సూచించినట్లు విశ్వసనీయ సమాచారం.
అయితే త్వరలోనే జరగనున్న Zptc, mptc ఎన్నికల్లో కూడా ఇదే విధంగా పునరావృతం అయితే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తోంది. మరో వైపు మంత్రులతో సమావేశంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలు, శాసనసభలో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకోపక్క ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ జరగనుంది. అటు సొసైటీ పాలక మండళ్లకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై సీఎం రేవంత్ మంత్రులతో చర్చించనున్నారు. చివరగా రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరు, బదిలీలపై మంత్రులతో చర్చించే అవకాశం ఉంది.