2034 వరకూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది : సీఎం రేవంత్

ఇందిరమ్మ రాజ్యంలో పేదలు సుభిక్షంగా ఉండాలని సన్నబియ్యం ఇచ్చామ‌ని.. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

By Medi Samrat
Published on : 14 July 2025 6:30 PM IST

2034 వరకూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది : సీఎం రేవంత్

ఇందిరమ్మ రాజ్యంలో పేదలు సుభిక్షంగా ఉండాలని సన్నబియ్యం ఇచ్చామ‌ని.. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తిరుమలగిరి బహిరంగ సభలో ఆయ‌న మాట్లాడుతూ.. తుంగతుర్తి గడ్డకు గొప్ప చరిత్ర ఉంది.. సాయుధ రైతాంగ పోరాటం చేసిన గడ్డ నల్గొండ, తుంగతుర్తి.. నల్గొండ చరిత్రనే తెలంగాణ చరిత్ర అంటే అతిశయోక్తి కాద‌న్నారు.

నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు, మూసీ ప్రాజెక్టు కట్టి నల్గొండ రైతులకు నీళ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.. కేసీఆర్ ఉంటే గోదావరి జలాలు మూడు రోజులలో తీసుకు వస్తానని ఒకరు అంటున్నారు.. గ్లాస్‌లో సోడా కాదు గోదావరి జలాలు తీసుకురావడం.. 10 ఏళ్లు అధికారంలో ఉన్నపుడు ఎందుకు గోదావరి నీళ్లు తీసుకురాలేదు.? అని ప్ర‌శ్నించారు. సొంత మండలానికి ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకురాని సన్నాసి మమల్ని అంటావా.? అంటూ మండిప‌డ్డారు.

10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్లకు రేషన్ కార్డు లు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదు..పేదలకు బుక్కెడు బువ్వ పెట్టాలన్న ఆలోచన రాలేదు.. మా ప్రభుత్వం మూడు కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తుంద‌న్నారు. బీఆర్ఎస్ హయాం లో గ్రామాల్లో బెల్టుషాప్‌లుఉంటే మా ప్రభుత్వంలో సన్నబియ్యం కోసం జనం బారులు తీరుతున్నారన్నారు.

మా ప్రభుత్వంపైన కళ్ల‌ల్లో నిప్పులు పోసుకుంటున్నారు.. రైతులకు500 రూపాయల బోనస్, సన్నబియ్యం, రైతు భరోసా, రైతు రుణ మాఫీ లాంటి పథకాలు ఇందిరమ్మ రాజ్యం లోనే సాధ్యం అన్నారు. 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రైతు రుణ మాఫీ చేసి రుణ విముక్తి కల్పించామ‌ని పేర్కొన్నారు.

రైతు భరోసా ఇవ్వమని బీఆర్ఎస్ ప్రచారం చేసింది.. కానీ 9 రోజులలోనే 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసి వాళ్లలో సంతోషం నింపాం.. వ్యవసాయం దండుగ కాదు పండుగ చేశాం.. 2.85 లక్షల ధ్యానం పండించి దేశంలోనే నెంబర్ 1 గా నిలిచాం.. రైతులు సంతోషంగా ఉంటేనే ఇందిరమ్మ ఆత్మ సంతోషంగా ఉంటుంది.. సోనియమ్మ కల నెరవేరుతుందన్నారు.

కొత్తగా 5.6 లక్షల మంది కి రేషన్ కార్డులు మంజూరు చేశాం.. 26 లక్షల మంది పేర్లు కొత్తగా రేషన్ కార్డులలో నమోదు చేశాం.. 3.10 కోట్లమందికి సన్నబియ్యం పంపిణీ చేశాం.. 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు 2 చీరలు పంపిణీ చేయబోతున్నాం.. స్వయం సహాయక సంఘాల గ్రూపులకు 21 వేల కోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా అందిస్తున్నామ‌ని తెలిపారు.

ఆర్టీసీ బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నాం..ఇందుకోసం 6500 కోట్ల రూపాయల ఖర్చు చేశాం.. మహిళా సంఘాలకు బస్ లు కొనిస్తున్నాం.. పెట్రోల్ బంక్ లు ఏర్పాటు చేస్తున్నాం.. సోలార్ పవర్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయించి 1000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందం చేసుకుంటున్నామ‌ని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో ప్రభుత్వ స్కూల్స్ బాగు చేయించాం.. 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే రికార్డ్ సృష్టించాం.. 2 ఏళ్లల్లో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామ‌న్నారు.

కేసీఆర్ లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయింది.. 60 ఏళ్లలో కాంగ్రెస్ కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ ఆర్ ఎస్ పీ, జూరాల లాంటి ప్రాజెక్ట్ లు ఎలా ఉన్నాయి? కాళేశ్వరం ఎలా ఉందో చర్చకు సిద్ధమా. మిమ్మల్ని నీ ఊరి తీసినా పాపం లేదు.. తెలంగాణ ధనాన్ని దోచుకున్నారని మండిప‌డ్డారు. తుంగతుర్తికి గోదావరి జలాలు తీసుకువచ్చి తీరుతామ‌న్నారు.. నల్గొండ జిల్లాలో ఒక గంజాయి మొక్క ఉంది.. వచ్చే ఎన్నికల్లో పీకేయాలన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తల్ని గెలిపించే బాధ్యత మాది.. త్వ‌రలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి..స్థానిక సంస్థల ఎన్నికల్లో గొప్ప మెజారిటీతో పార్టీ ని గెలిపించాలని కోరారు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది.. తెలంగాణ గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఎగురుతుందని.. తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిదుతామ‌న్నారు.

దేశంలోనే మొదటగా తెలంగాణ ఎస్సీ వర్గీకరణ చేసింది.. 100 సంవత్సరాల తర్వాత తెలంగాణ లో కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామ‌న్నారు. మోదీ మెడలు వంచి జనగణనలో కులగణన చేపట్టేలా చేశాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కలిపిస్తున్నాం.. బీసీలకు రాజ్యాధికారం కల్పించేలా కృషి చేస్తున్నామ‌ని అన్నారు.

Next Story