తెలంగాణను అంతర్జాతీయ క్రీడా హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాశాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ఒలింపిక్స్, కామన్‌వెల్త్ క్రీడలకు రాష్ట్రం ఆతిథ్యమిచ్చేలా, అలాగే మన క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ' (YISU) నిర్మాణంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలని, ఇందుకు సంబంధించిన వివిధ డిజైన్లను పరిశీలించి పలు కీలక సూచనలు చేశారు.
గచ్చిబౌలి ఔట్‌డోర్ స్టేడియం పునరుద్ధరణతో పాటు, అదే ఆవరణలో ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, అధునాతన హాస్టల్ భవనాలు మరియు అన్ని రకాల క్రీడా మైదానాలు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. వీటితో పాటు నగరంలోని ఎల్బీ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, సరూర్‌నగర్ స్టేడియంలను క్రీడాకారుల శిక్షణ మరియు భవిష్యత్ పోటీలకు అనుగుణంగా ఆధునీకరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, యూనివర్సిటీ వీసీ డాక్టర్ జి. కిషోర్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొని క్రీడారంగ అభివృద్ధిపై చర్చించారు.